దేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ చేతులు కలుపుతోంది: నరేంద్ర మోదీ

  • కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు
  • సమాజం ప్రశాంతంగా ఉంటే.. కాంగ్రెస్ ప్రశాంతంగా ఉండదని వ్యాఖ్య
  • దేశం అభివృద్ధి, ప్రగతి పథంలో నడుస్తుంటే ఆ పార్టీకి నచ్చడం లేదని ఎద్దేవా
కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజీ బిజీగా ఉన్నారు. వరుస ర్యాలీలు, రోడ్ షోలతో బీజేపీకి తిరిగి అధికారం అప్పగించే దిశగా కృషి చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో ప్రచారంలో జోరు పెంచిన మోదీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.  నిన్న మూడబిడ్రిలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ..  గతంలో కాంగ్రెస్ హయాంలో  కర్ణాటక అస్థిరంగా ఉండేదని మోదీ ఆరోపించారు. అలాగే, దేశ వ్యతిరేక శక్తులతో ఆ పార్టీ చేతులు కలుపుతోందన్నారు.  దేశ సైన్యాన్ని దూషిస్తున్న, అగౌరపరుస్తున్న ఎస్‌డీపీఐ పార్టీ కాంగ్రెస్ కు మద్దతిస్తోందని మోదీ చెప్పుకొచ్చారు. 

సమాజం ప్రశాంతంగా ఉంటే.. కాంగ్రెస్ ప్రశాంతంగా ఉండలేదని విమర్శించారు.  దేశం అభివృద్ధిలో,  ప్రగతిపథంలో పయనిస్తుంటే కాంగ్రెస్ సహించడం లేదన్నారు.  ఆ పార్టీ కేవలం ‘విభజించు, పాలించు’ సూత్రంపైనే రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీ  ప్రమాదకర వైఖరికి సాక్ష్యంగా కర్ణాటక నిలుస్తుందని ఆయన ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను ఏటీఎంలా వాడుకోవాలని చూస్తోందన్నారు.   బీజేపీ మాత్రం కర్ణాటక అన్ని రంగాల్లో  నెంబర్ వన్‌ రాష్ట్రంగా  ఉండాలని కోరుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్ రిటైర్‌మెంట్ పేరుతో ఓట్లు అడుగుతోందని,  బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోందని దుయ్యబట్టారు.


More Telugu News