జగన్ భోగాపురం పర్యటన.. పలాసలో ట్రాఫిక్ నిలిపివేత

  • జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
  • అక్కడికి జగన్ వస్తే ఇక్కడ లారీలు ఆపేయడమేంటని డ్రైవర్ల ఆగ్రహం
  • ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలంటూ పోలీసుల వివరణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ భోగాపురం పర్యటన సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలను నిలిపివేశారు. లక్ష్మీపురం టోల్ గేట్ సమీపంలో వాహనాలను ఆపేయడంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 130 కిలోమీటర్ల దూరంలోని భోగాపురం కు సీఎం జగన్ వస్తే.. ఇక్కడ తమ వాహనాలను ఎందుకు ఆపేశారంటూ లారీ డ్రైవర్లు అధికారులను నిలదీస్తున్నారు.

విజయనగరం జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి జగన్ బుధవారం భోగాపురం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా పలాసలో వాహనాలను నిలిపివేశారు. దీనిపై లారీ డ్రైవర్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వాహనాలను ఆపేసినట్లు ట్రాఫిక్ సిబ్బంది చెబుతున్నారు.


More Telugu News