టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీపై భార్య సంచలన ఆరోపణలు

  • షమీ ఇప్పటికీ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడన్న హసీన్ జహాన్ 
  • కట్నం తేవాలంటూ తనను వేధించేవాడని ఆరోపణ
  • అరెస్టు వారెంట్ పై స్టే ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు
టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీపై అతడి భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త ఇప్పటికీ వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. షమీ కట్నం అడిగి తనను వేధించేవాడని తెలిపారు. అతడిపై నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించిన విచారణలో నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. షమీ అరెస్టు వారెంట్ పై స్టే ఎత్తివేయాలని కోరారు.
 
హసీన్‌ జహాన్‌ను షమీ 2014లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే షమీ తనపై గృహ హింసకు పాల్పడుతున్నాడని 2018లో కోల్ కతాలోని జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో హసీన్ ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. 

ఈ క్రమంలో 2019 ఆగస్టులో కోల్ కతాలోని అలిపోర్ కోర్టు.. షమీపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీన్ని సెషన్స్ కోర్టులో అతడు సవాలు చేయగా.. అరెస్టు వారెంట్, విచారణ ప్రక్రియపై స్టే విధిస్తూ సెప్టెంబర్ లో కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయాన్ని కలకత్తా హైకోర్టులో హసీన్ సవాల్ చేశారు. షమీ అరెస్టు వారెంట్ పై స్టే ఎత్తివేయాలని కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించారు.


More Telugu News