లాటరీలో రూ.2.5 కోట్లు గెలుచుకున్నా రూపాయి కూడా దక్కట్లేదు.. కారణం ఏంటంటే!

  • ఒక్క పొరపాటుతో కోట్లు నష్టపోతున్న వ్యక్తి
  • ప్రభుత్వ ఖజానాలోకి చేరనున్న లాటరీ సొమ్ము
  • లాటరీ విజేతను గుర్తించి సొమ్ము అప్పగించేందుకు ప్రయత్నిస్తున్న నిర్వాహకులు
పంజాబ్ లో ఓ వ్యక్తి రూ.20 ల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.. అదృష్టంకొద్దీ ఆయన కొన్న టికెట్ కే లాటరీ తగిలింది. ఏకంగా రూ.2.5 కోట్లు గెలుచుకున్నాడు. అయితే, దురదృష్టం వెంటాడుతున్నట్లు ఉంది.. ఆ రెండున్నర కోట్ల రూపాయలలో ఒక్క రూపాయి కూడా అతడికి దక్కేలా లేదు. ఆ సొమ్ము మొత్తం ప్రభుత్వ ఖజానాలోకి చేరేలా ఉందని లాటరీ నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి కారణం సదరు లాటరీని కొనుగోలు చేసిన వ్యక్తేనని, ఆయన చేసిన పొరపాటు వల్లే ఈ డబ్బు కోల్పోతున్నాడని చెప్పారు.

ఇంతకీ ఆయన చేసిన తప్పేంటంటే.. లాటరీ కొనుగోలు చేసినపుడు తన పేరు తప్ప ఇతర వివరాలు ఏవీ ఇవ్వకపోవడమే. మొబైల్ నెంబర్ కానీ, చిరునామా కానీ తెలియకపోవడంతో లాటరీ గెలుచుకున్న సమాచారం అందించేందుకు కంపెనీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నిర్ణీత సమయంలోగా లాటరీ క్లెయిమ్ చేసుకోకుంటే చట్టప్రకారం ఆ సొమ్ము మొత్తం అధికారులు ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తారు.

రాష్ట్రంలోని ఫజిల్క్ జిల్లాకు చెందిన సాక్ష్ అనే వ్యక్తి ఈ టికెట్ కొనుగోలు చేశాడని లాటరీ దుకాణదారుడు బాబీ జవేజా చెప్పారు. అయితే, సాక్ష్ తన ఫోన్ నెంబర్, అడ్రస్ ఇవ్వలేదని, అతడి జాడ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. లాటరీ టికెట్ ఫలితాలను మీ టికెట్ నెంబర్ తో చెక్ చేసుకోవాలని, లాటరీ గెలుచుకున్న వ్యక్తి రూప్ చంద్ లాటరీ కంపెనీని సంప్రదించాలని బాబీ విజ్ఞప్తి చేశారు. లాటరీ టికెట్ కొన్నపుడు పేరుతో పాటు ఫోన్ నెంబర్, అడ్రస్ రాస్తే.. విజేతలను సులువుగా సంప్రదించే అవకాశం ఉంటుందని బాబీ చెప్పారు.


More Telugu News