నేడు ఢిల్లీకి కేసీఆర్.. రేపు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం

  • ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా రాజశ్యామల యాగం చేయనున్న కేసీఆర్
  • 200 మందికి పైగా హాజరుకానున్న ప్రజా ప్రతినిధులు
  • పలువురు జాతీయ నాయకులతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని రేపు ప్రారంభించనున్నారు. వసంత్‌ విహార్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ కార్యాలయం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఓపెనింగ్ కు సిద్ధమైంది.

టీఆర్ఎస్.. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. జాతీయ స్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడవనున్నాయి.

బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 200 మంది ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ అక్కడే ఉండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

ఆఫీసు ప్రారంభోత్సవం తర్వాత.. కేసీఆర్ గురువారం ఢిల్లీలోనే ఉంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మరికొందరు జాతీయ నాయకులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి వస్తారని సమాచారం.


More Telugu News