చచ్చీచెడీ 130 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

  • అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • 23 పరుగులకే 5 వికెట్లు డౌన్
  • ఆదుకున్న అమన్ ఖాన్, రిపల్ పటేల్, అక్షర్ పటేల్
  • 4 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ వెన్ను విరిచిన షమీ
ఐపీఎల్ లో దారుణమైన ఆటతీరు కనబరుస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇవాళ గుజరాత్ టైటాన్స్ పైనా అదే తీరులో ఆడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ అతి కష్టమ్మీద 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసింది. 

ఓ దశలో 23 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 50 పరుగులు చేయడం కూడా కష్టమే అనిపించింది. అయితే అక్షర్ పటేల్ (27), అమన్ ఖాన్ (51), రిపల్ పటేల్ (23) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ముఖ్యంగా, గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ దాడులకు ఎదురొడ్డిన అమన్ ఖాన్ అర్ధసెంచరీ నమోదు చేయడం విశేషం. అమన్ 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 51 పరుగులు చేశాడు. చివర్లో రిపల్ పటేల్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 23 పరుగులు సాధించాడు. 

అసలు, ఇన్నింగ్స్ మొదటి బంతికే ఫిలిప్ సాల్ట్ (0) డకౌట్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమీ నిప్పులు చెరిగే బంతులతో ఢిల్లీ క్యాపిటల్స్ టాపార్డర్ ను కకావికలం చేశాడు. షమీ 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం ఈ మ్యాచ్ లో హైలైట్. మోహిత్ శర్మ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశాడు.


More Telugu News