రజనీకాంత్ చెప్పిన వాటిల్లో వాస్తవాలు లేవు కాబట్టే వ్యతిరేకిస్తున్నాం: మంత్రి అమర్నాథ్

  • ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభ
  • చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించిన రజనీకాంత్ 
  • మండిపడుతున్న వైసీపీ నేతలు
  • వైసీపీ నేతలు రజనీకాంత్ కు క్షమాపణ చెప్పాలన్న చంద్రబాబు
  • సినిమాల్లో మాట్లాడినట్టు బయట మాట్లాడితే కౌంటర్ తప్పదన్న అమర్నాథ్ 
ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభలో సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబును వేనోళ్ల కొనియాడారు. అది మొదలు... రజనీకాంత్ కాస్తా వైసీపీ నేతలకు టార్గెట్ అయ్యారు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో రజనీకాంత్ పై ఓ రేంజిలో విమర్శల దుమారం రేగుతోంది. దాంతో చంద్రబాబు కూడా స్పందించాల్సి వచ్చింది. వైసీపీ నేతలు రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీకాంత్ కు తామెందుకు క్షమాపణలు చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు గురించి రజనీకాంత్ చెప్పిన వాటిల్లో వాస్తవాలు లేవు కాబట్టే తాము వ్యతిరేకిస్తున్నామని అమర్నాథ్ స్పష్టం చేశారు. 

ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డానికి ఇదేమీ సినిమా కాదని, సినిమాల్లో మాదిరి ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు ఇక్కడ కుదరదని, ఇది రాజకీయం అని అన్నారు. రజనీకాంత్ కు ఈ విషయం అర్థమయ్యే పార్టీ పెట్టడంపై వెనుకంజ వేసి ఉంటారని అమర్నాథ్ పేర్కొన్నారు. 

ఓ దొంగ, ఓ హంతకుడు సభ ఏర్పాటు చేస్తే, ఆ సభకు రావడమే కాకుండా, పొగడ్తలు కురిపిస్తే చూస్తూ ఊరుకుంటారా? అని ఆగ్రహం వెలిబుచ్చారు. సినిమాల్లో మాట్లాడినట్టు బయట మాట్లాడితే కౌంటర్ తప్పదని హెచ్చరించారు.


More Telugu News