కాంగ్రెస్ వారంటీ గడువు ముగిసిపోయింది: ప్రధాని మోదీ సెటైర్

కాంగ్రెస్ వారంటీ గడువు ముగిసిపోయింది: ప్రధాని మోదీ సెటైర్
  • కాంగ్రెస్, జేడీఎస్ లు కర్ణాటక అభివృద్ధి గురించి ఏనాడూ ఆలోచించలేదన్న ప్రధాని
  • ఆ పార్టీలు తమ కుటుంబాల కోసమే పని చేస్తాయని విమర్శ 
  • బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడూ అభివృద్ధి కోసమే పనిచేస్తాయని వ్యాఖ్య
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కర్ణాటక అభివృద్ధి గురించి, పిల్లల భవిష్యత్తు కోసం ఏనాడూ ఆలోచించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ వారంటీ గడువు ముగిసిపోయిందని విమర్శించారు. ఈ రోజు కర్ణాటకలోని చిత్రదుర్గలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు.

కర్ణాటకలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసి అద్భుతం సృష్టించిందని, ఇది దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మార్చడానికి రోడ్ మ్యాప్ అని మోదీ అన్నారు. మహిళలు, యువత సాధికారతపై దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు.

బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడూ అభివృద్ధి కోసమే పనిచేస్తాయని తెలిపారు. కాంగ్రెస్, జేడీఎస్ మాత్రం తమ కుటుంబాల కోసమే పని చేస్తాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం స్థానిక భాషలో పరీక్ష రాయడానికి అనుమతించిందని.. విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. ఆర్థిక ప్రగతి, సుస్థిరత కోసం బీజేపీ పని చేస్తోందన్నారు.

అధికారం కోసం కాంగ్రెస్ నేతలు తప్పుడు హామీలు ఇస్తున్నారని.. ప్రజలను మోసం చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. వారి హామీలతో ప్రజల, రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని తెలుసు కాబట్టే.. ఇలాంటి వాగ్దానాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.


More Telugu News