దుస్తుల బ్రాండ్ ప్రారంభించిన షారుక్ ఖాన్ కొడుకు.. భారీ రేట్లపై ట్రోల్స్.. కిడ్నీని యాక్సెప్ట్ చేస్తారా? అంటూ నెటిజన్ల కామెంట్లు!

  • ‘డి యావోల్ ఎక్స్’ పేరుతో దుస్తుల బిజినెస్ ప్రారంభించిన ఆర్యన్ ఖాన్
  • ఒక్కో టీషర్ట్ ధర రూ.22 వేల పైనే.. లెదర్ జాకెట్ రూ.2 లక్షలు
  • నిన్న సేల్స్ ప్రారంభం.. అన్నీ అమ్ముడుపోయాయన్న ఆర్యన్
  • విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్.. ఇటీవల దుస్తుల బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. ‘డి యావోల్ ఎక్స్’ పేరుతో దుస్తులు విక్రయిస్తున్నాడు. అయితే బట్టల రేట్లు భారీగా ఉండటంపై సోషల్ మీడియలో ట్రోల్స్ పోటెత్తుతున్నాయి.  

నిజానికి ‘డి యావోల్ ఎక్స్’ పేరుతో లగ్జరీ డ్రస్ లనే అమ్ముతున్నారు. వెబ్ సైట్ లో షారూక్ వేసుకున్న లెదర్ జాకెట్ ధర రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఇక టీషర్ట్ ల ధరలైతే.. రూ.22 వేల నుంచి 24 వేల దాకా ఉన్నాయి. ఇక హుడీస్ టీషర్ట్ లైతే ఏకంగా రూ.45 వేలకు పైనే ఉన్నాయి. ఈ ధరలను బట్టి చూస్తే.. ఇవి సామాన్యులకు కాదని, ధనికులకు మాత్రమేనని అర్థమవుతోంది.

నిన్న సేల్స్ ప్రారంభించారు. అన్నీ అమ్ముడుపోయాయని తర్వాత ఆర్యన్ పోస్ట్ చేశాడు. ‘‘అన్నీ అమ్ముడుపోయాయి. తర్వాత సేల్ కోసం స్టే ట్యూన్డ్’’ అని పేర్కొన్నాడు. దీంతో భారీ ధరలపై కామెంట్ల వర్షం కురుస్తోంది.

ఒకరైతే.. ‘నా కిడ్నీని యాక్సెప్ట్ చేస్తారా?’ అని కామెంట్ చేశారు. ఇంకొకరైతే.. ‘‘నన్ను ఇంత పేదవాడికి ఎందుకు పుట్టించావు దేవుడా? నాకూ రూ.2 లక్షల జాకెట్ కావాలి’’ అని రాసుకొచ్చారు. ‘‘రెండు ఎకరాలు అమ్మి డబ్బులు తీసుకుని వచ్చాను. తీరా చూస్తే అన్నీ అమ్ముడుపోయాయని బోర్డు పెట్టారు’’ అని మరో యూజర్ కామెంట్ చేశాడు.


More Telugu News