వచ్చే ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు: ఐఎండీ

  • తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలకు వర్ష సూచన
  • దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇవే పరిస్థితులు
  • వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్లేనన్న ఐఎండీ
  • సాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా
దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు ప్రాంతాలతో కూడిన దక్షిణ భారత్ లో వచ్చే ఐదే రోజుల పాటు భారీ నుంచి, అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. 

అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో వారం పాటు భారీ వర్షాలు ఉంటాయని, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశాలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, పిడుగులు పడొచ్చని హెచ్చరించింది. మధ్య భారత్ లోని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది. అలాగే, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో వడగండ్ల వానలు పడతాయని ప్రకటించింది. 

వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల ఈ అకాల వర్షాలు వచ్చినట్టు ఐఎండీ వివరించింది. హర్యానా, పరిసర ప్రాంతాల్లో దిగువ నుంచి ఎగువ ట్రోపోస్ఫెరిక్ స్థాయులపై సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడినట్టు తెలిపింది. మరో వెస్టర్న్ డిస్టర్బెన్స్ కూడా దక్షిణ పాకిస్థాన్ మధ్య ట్రోపోస్ఫెరిక్ స్థాయుల్లో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. వచ్చే ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎలాంటి వేడి గాలులు ఉండవని, సాధారణ స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది.


More Telugu News