మైదానంలో గొడవ.. కోహ్లీ, గంభీర్ పై ఐపీఎల్ కఠిన చర్య!

  • ఇద్దరికీ నూరు శాతం మ్యాచ్ ఫీజులో కోత
  • నవీనుల్ హక్ కు మ్యాచు ఫీజులో 50 శాతం జరిమానా
  • ప్రకటన విడుదల చేసిన ఐపీఎల్
ఆటగాళ్లు అయి ఉండి, క్రీడాస్ఫూర్తితో మెలగాల్సింది పోయి, మ్యాచ్ అనంతరం దూషించుకోవడం, గొడవపడడం ద్వారా తమ హుందాతనాన్ని కోల్పోయారు. వారే లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్, బెంగళూరు సూపర్ జెయింట్స్ ఓపెనర్ విరాట్ కోహ్లీ. వీరితోపాటు కోహ్లీతో అనుచితంగా వ్యవహరించిన లక్నో బౌలర్ నవీనుల్ హక్ పై బీసీసీఐ కఠిన చర్య తీసుకుంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం ద్వారా వీరు తప్పు చేసినట్టు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. లక్నో లోని ఏక్నా స్టేడియంలో ఆర్సీబీ, ఎల్ఎస్ జీ జట్ల మధ్య సోమవారం మ్యాచ్ సందర్భంగా అనుచిత ఘటనలు చోటు చేసుకున్నాయి. 

దీంతో గంభీర్, కోహ్లీలకు నూరు శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించారు. అలాగే, నవీనుల్ హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టారు. వీరు ముగ్గురూ తాము చేసిన నేరాలను అంగీకరించడమే కాకుండా, చర్యలకు కట్టుబడి ఉంటామని తెలిపినట్టు ఐపీఎల్ నుంచి ప్రకటన వెలువడింది. నిన్నటి మ్యాచ్ లో లక్నో తమ ముందున్న లక్ష్యాన్ని ఛేదించే విషయంలో అపసోపాలు పడింది. వికెట్ పడిన ప్రతిసారీ కోహ్లీ అంతులేని సంబరాలతో సందడి చేయడాన్ని ప్రేక్షకులు గమనించారు. ముఖ్యంగా కోహ్లీ, గంభీర్ మధ్య నెలకొన్న వ్యక్తిగత వైరం క్రీడా వాతావరణాన్ని చెడగొడుతోంది. అంతకుముందు బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో బెంగళూరు జట్టుపై లక్నో జట్టు గెలిచిన సందర్భంలో గంభీర్ చేసిన హావభావాలకు ప్రతీకారంగా అన్నట్టు.. నిన్నటి మ్యాచులో కోహ్లీ రెచ్చిపోవడం కనిపించింది.


More Telugu News