తీహార్ జైలులో గ్యాంగ్ స్టర్ హత్య

  • ఇనుప రాడ్లతో కొట్టి చంపిన ప్రత్యర్థులు
  • ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయిన గ్యాంగ్ స్టర్ టిల్లూ తాజ్ పూరియా
  • ఢిల్లీ కోర్టులో షూట్ ఔట్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిల్లూ
ఢిల్లీలోని తీహార్ జైలులో గ్యాంగ్ స్టర్ టిల్లూ తాజ్ పూరియా అలియాస్ సునీల్ మాన్ హత్యకు గురయ్యాడు. అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రత్యర్థి గ్యాంగు సభ్యులు ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. తీహార్ జైలులో మంగళవారం ఉదయం ఈ హత్య జరిగింది. టిల్లూ గ్యాంగ్, జితేందర్ గోగి గ్యాంగ్ కు మధ్య గొడవలు ఉన్నాయని, ఈ క్రమంలోనే జితేందర్ గోగిని టిల్లూ హత్య చేయించాడని పోలీసులు చెప్పారు.

2021 లో రోహిణి కోర్టుకు హాజరైన జితేందర్ ను టిల్లూ గ్యాంగ్ సభ్యులు కాల్చిచంపారు. లాయర్ల మాదిరిగా నల్లకోటు వేసుకుని వచ్చిన గ్యాంగ్ స్టర్లు కోర్టు లోపల విచారణ జరుగుతుండగా కాల్పులు జరిపారు. దీంతో జితేందర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో హంతకులు ఇద్దరూ చనిపోయారు. ఈ హత్య నేపథ్యంలో టిల్లూపై జితేందర్ గ్యాంగ్ కక్ష పెంచుకుంది.

తీహార్ జైలులోని హై సెక్యూరిటీ ప్రిజన్ లో ఉన్న టిల్లూపై అదే జైలులో ఉన్న జితేందర్ గ్యాంగ్ సభ్యుడు యోగేశ్ తుండా తన అనుచరులతో కలిసి దాడి చేశాడు. మంగళవారం ఉదయం ఐరన్ గ్రిల్స్ ను తొలగించుకుని సెల్ బయటకు వచ్చిన యోగేశ్.. అవే రాడ్లతో టిల్లూపై దాడి చేశాడు. రాడ్లతో విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన టిల్లూ అక్కడికక్కడే చనిపోయాడు. ఇంతలో జైలు అధికారులు అక్కడికి చేరుకుని యోగేశ్ ను మరో సెల్ లో పెట్టారు. టిల్లూను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని వైద్యులు ప్రకటించారు.


More Telugu News