చెన్నై జట్టుకు ధోనీ తర్వాత అతడే సరైన సారథి: వసీం అక్రమ్

  • అజింక్య రహానే మెరుగ్గా నడిపిస్తాడన్న అభిప్రాయం
  • విదేశీ ఆటగాళ్లతో వచ్చేదేమీ లేదన్న అక్రమ్
  • స్థానిక ఆటగాళ్లతోనే చక్కటి ఫలితాలు వస్తాయని సూచన
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సారథిగా మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ కు సమీపంలో ఉండడంతో తదుపరి ఈ జట్టును నడిపించే వ్యక్తి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ధోనీ వారసుడిగా రవీంద్ర జడేజాను అనుకుని 2022 ఐపీఎల్ సీజన్ కు ముందు అతడికి సారథ్యాన్ని యాజమాన్యం కట్టబెట్టింది. కానీ, అప్పటి వరకు జట్టును నడిపించిన అనుభవం లేకపోవడంతో జడేజా నాయకత్వంలో చెన్నై వరుస ఓటములు చూసింది. గత్యంతరం లేక అతడు కెప్టెన్సీని వీడి, గాయం పేరుతో ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ధోనీ ఆలస్యంగా బాధ్యతలు చేపట్టడంతో చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్లలేక లీగ్ దశ నుంచే నిష్క్రమించింది.

ఈ ఏడాది ధోనీ నాయకత్వంలో చెన్నై తిరిగి మంచి ఫలితాలనే చూస్తోంది. ఈ తరుణంలో తదుపరి ఎవరు చెన్నై జట్టును ముందుకు తీసుకెళతారనే చర్చ కొనసాగుతూనే ఉంది. కొందరు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అనుకుంటుంటే, కొందరు క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్ సరైనోడన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ సైతం దీనిపై స్పందించాడు. సీనియర్ బ్యాటర్, ఇటీవలే మినీ వేలం ద్వారా చెన్నై జట్టులో చేరిన అజింక్య రహానే పేరును సూచించాడు. 

‘‘సీఎస్కే ఐపీఎల్ 2022లో రవీంద్ర జడేజాని ప్రయత్నించి చూసింది. దాంతో జడేజా సొంత ఆట కూడా దెబ్బతిన్నది. కెప్టెన్ ను మార్చాల్సిన అవసరం భవిష్యత్తులో ఉంది. నా ఉద్దేశ్యంలో రహానే ను మించి మెరుగైన ఆప్షన్ వారికి లేదు. అతడు అయితే స్థిరత్వంతోపాటు, స్థానిక క్రీడాకారుడు. ఫ్రాంచైజీ క్రికెట్ లో స్థానిక ఆటగాళ్లు ఎక్కువగా విజయం సాధిస్తుండడం చూస్తున్నాం’’ అని స్పోర్ట్స్ కీదా సంస్థతో అక్రమ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 

‘‘విదేశీ ఆటగాళ్లు అయితే జట్టులోని ఆటగాళ్ల పేర్లను సైతం గుర్తు పెట్టుకోలేరు. అలాంటప్పుడు వారు జట్టును ఎలా నడిపిస్తారు. ధోనీ ఇక ఆడలేనని తేల్చి చెబితే రహానే మెరుగైన ఆప్షన్ అవుతాడు. సీఎస్కేకు సొంత ప్రణాళికలు ఉండొచ్చు. ఫ్రాంచైజీగా వారు ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కు జట్టులోపలా, బయటా సంస్కృతి గురించి బాగా తెలుసు. ఆటగాళ్లు కూడా అతడ్ని విశ్వసిస్తారు’’అని అక్రమ్ పేర్కొన్నాడు.


More Telugu News