ఐసిస్ చీఫ్ హతం.. ప్రకటించిన టర్కీ అధ్యక్షుడు!

  • టర్కీ, సిరియా దళాల సంయుక్త ఆపరేషన్
  • 60 నిమిషాల్లో మట్టుబెట్టామన్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్
  • మృతదేహాన్ని పరీక్షించిన తర్వాత నిర్ధారించినట్లు వెల్లడి
ఐసిస్ చీఫ్ హతమయ్యాడు. అతడిని మట్టుబెట్టినట్లు టర్కీ (తుర్కియే) ప్రకటించింది. ఐసిస్ చీఫ్ గా భావిస్తున్న వ్యక్తిని తాము అంతమొందించామని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ వెల్లడించారు. సిరియాలో తమ ఎంఐటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేపట్టిన ఆపరేషన్‌లో అబు హుస్సేన్ అల్ ఖురేషీ చనిపోయినట్లు చెప్పారు. 

2019 అక్టోబర్ లో ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీని అమెరికా హతమార్చింది. తర్వాత గతేడాది నవంబర్ 30న ఐసిస్ చీఫ్ గా ఉన్న అబు హసన్ అల్ హషిమీ అల్ ఖురేషీ హతమైనట్టు ఐసిస్ ప్రకటించింది. దీంతో అతడి స్థానంలో అబు హుస్సేన్ అల్ ఖురేషీని నియమించినట్లు వెల్లడించింది. 

‘‘ఆఫ్రిన్ వాయవ్య ప్రాంతంలోని జిండిరెస్‌లో ఒక జోన్‌ను టర్కీ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, స్థానిక మిలిటరీ పోలీసులు చుట్టుముట్టారు. ఇస్లామిక్ పాఠశాలగా వినియోగిస్తున్న ఒక పొలాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించారు’’ అని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. 

శ‌నివారం (స్థానిక కాలమానం ప్రకారం) 60 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తయిందని, మృతదేహాన్ని పరీక్షించిన తర్వాత అది ఐసిస్ చీఫ్‌దేనని నిర్ధారించినట్లు ఎర్డోగన్ తెలిపారు. కాగా, ఉత్తర సిరియాలో 2020 నుంచి టర్కీ తన దళాలను మోహరిస్తూ వస్తోంది. సిరియా దళాల సాయంతో మొత్తం జోన్లను నియంత్రిస్తోంది.


More Telugu News