ఇంతకీ ప్రజలకు ప్రవేశం ఉందా? లేదా?: విజయశాంతి

  • కేసీఆర్ సీఎం అయ్యాక ప్రగతి అంతా ప్రగతిభవన్‌కే పరిమితమైందన్న విజయశాంతి
  • ప్రజలు అధోగతి పాలయ్యారని విమర్శ
  • కొత్త సచివాలయంలోనైనా జనానికి సీఎం అందుబాటులోకి వస్తారా అని ప్రశ్న 
తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ నేత విజయశాంతి విమర్శలు చేశారు. సుమారు రూ.1,000 కోట్ల ప్రజల సొమ్ముతో నిర్మించినట్టు చెబుతున్న తెలంగాణ నూతన సచివాలయంలో సామాన్య ప్రజలకి ప్రవేశం ఉందా? లేదా? అనేది ఇప్పుడొక మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారిందని అన్నారు. ఈ రోజు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. 

‘‘ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార నివాసంలో గాని, సచివాలయంలో గాని గత సీఎంలు, మంత్రులు ప్రజల్ని కలుసుకోవడం, వారి సమస్యల్ని ఆలకించి సత్వర పరిష్కారాలు సూచించడం తరచుగా కనిపించేది. తెలంగాణ వచ్చి, కేసీఆర్ సీఎం అయ్యాక ప్రగతి అంతా ప్రగతిభవన్‌కి, ఎర్రవల్లి ఫాంహౌస్‌కి మాత్రమే పరిమితమై ప్రజలు అధోగతి పాలయ్యారు’’ అని విమర్శించారు.  

తెలంగాణ మంత్రులు కూడా కేసీఆర్ బాటలోనే నడిచి ప్రజలకు దూరమయ్యారని విజయశాంతి ఆరోపించారు. ‘‘తొమ్మిదేళ్లుగా అటు ప్రగతి భవన్‌లో గాని, నాటి సచివాలయంలో గాని ప్రజలకు ముఖం చూపించని కేసీఆర్.. ఇప్పుడు కట్టించిన ఈ కొత్త సచివాలయంలోనైనా ప్రజలకు అందుబాటులోకి వస్తారా? ప్రజల్ని లోపలికి రానిస్తారా? అనేది అటు మీడియాలోనూ, జనసామాన్యంలోనూ చర్చనీయాంశంగా మారింది’’ అని చెప్పారు.

పేద ప్రజల త్యాగాలు, కష్టాలు, ఉద్యమాల స్వార్జితమైన మన తెలంగాణ రాష్ట్రం.. ఎందుకో మళ్లీ అహంకార, నియంతృత్వ విధాన స్థితికి వెళ్తోందని, అప్పుల రాష్ట్రంంగా మారుతోందని, ఈ విషయాన్ని ప్రజలకు అర్థం అయ్యేట్లు చెప్పాలని అన్నారు.


More Telugu News