హైదరాబాద్‌లో మళ్లీ కుమ్మేసిన వాన.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

  • గత రాత్రి నగరంలో భారీ వర్షం
  • తేరుకోకముందే మరోమారు కుమ్మేసిన వాన
  • ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న అధికారులు
  • అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
హైదరాబాద్‌లో గత రాత్రి కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంతలోనే అర్ధరాత్రి దాటాక మరోమారు వర్షం కుమ్మేసింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మాదాపూర్, గచ్చిబౌలి, బోరబండ, ఫిలింనగర్, బంజారాహిల్స్‌తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము వరకు వర్షం పడుతూనే ఉంది. ముఖ్యంగా మూసాపేట, సనత్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

భారీ వర్షంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, బల్దియా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. జోనల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా, నగరంలో నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.


More Telugu News