యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ... సొంతగడ్డపై ధూమ్ ధామ్!

  • ముంబయి ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీ
  • వాంఖెడే మైదానంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 212 పరుగులు
  • 62 బంతుల్లోనే 124 రన్స్ చేసిన యశస్వి జైస్వాల్
  • 16 ఫోర్లు, 8 సిక్సులతో వీరవిహారం
ముంబయి ఇండియన్స్ తో పోరులో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత సెంచరీ సాధించాడు.ఈ లెఫ్ట్ హ్యాండర్ 62 బంతుల్లో 124 పరుగులు సాధించి ఆఖరి ఓవర్లో అవుటయ్యాడు. జైస్వాల్ స్కోరులో 16 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయంటే అతడు ఏ రేంజిలో ముంబయి ఇండియన్స్ బౌలర్లను ఉతికాడో అర్థమవుతుంది. 

ఇక, ఐపీఎల్ లో సెంచరీ చేసిన 6వ అన్ క్యాప్డ్ (ఇప్పటివరకు జాతీయ జట్టుకు ఆడని) ప్లేయర్ గా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ ఈ ఘనతను తన సొంతగడ్డ ముంబయిలో సాధించడం విశేషం. 

జైస్వాల్ సెంచరీ సాయంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ఇన్నింగ్స్ చూస్తే... జైస్వాల్ సెంచరీ తప్ప ఇతరులు పెద్దగా రాణించలేదు. జోస్ బట్లర్ 18, కెప్టెన్ సంజు శాంసన్ 14, జాసన్ హోల్డర్ 11 పరుగులు చేశారు. 

ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ బౌలర్లు గాడి తప్పారు. ఏకంగా 25 ఎక్స్ ట్రాలు సమర్పించుకున్నారు. జైస్వాల్ తర్వాత అత్యధిక స్కోరు ఎక్స్ ట్రాలదే కావడం గమనార్హం. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో అర్షద్ ఖాన్ 3, పియూష్ చావ్లా 2, జోఫ్రా ఆర్చర్ 1, రిలే మెరిడిత్ 1 వికెట్ తీశారు.


More Telugu News