ఎమ్మెల్యే భవానీకి ఫోన్ లో ధైర్యం చెప్పిన చంద్రబాబు

  • చిట్ ఫండ్ కేసులో భవానీ భర్త వాసు, మామ అప్పారావు అరెస్ట్
  • అవకతవకలకు పాల్పడ్డారంటూ వారిపై ఆరోపణలు
  • అదుపులోకి తీసుకున్న సీఐడీ
  • కేసులు పెట్టి లొంగదీసుకునే ఆలోచనలు మానుకోవాలన్న చంద్రబాబు
రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు, మామ ఆదిరెడ్డి అప్పారావు జగజ్జనని చిట్ ఫండ్ కేసులో అరెస్ట్ కావడం తెలిసిందే. చిట్ ఫండ్ వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ అధికారులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజు రోజుకు వైసీపీ వేధింపులు పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రత్యర్థులను ఓడించడానికి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు పెట్టి లొంగదీసుకోవాలనే ఆలోచనలు మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.

సీఐడీ అనేది దర్యాప్తు ఏజెన్సీనా... లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఐడీ పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులపై ఇప్పటికే అనేకసార్లు కోర్టులతో చీవాట్లు తిన్నా ప్రభుత్వ బుద్ది మారకపోవడం... సీఎం జగన్ విషపు రాజకీయ ఆలోచనలకు నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో ఎవరూ ఏ వ్యాపారం చేసుకోకూడదు అన్నట్లు సీఎం జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని... ఈ కక్షసాధింపు పాలనకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.


More Telugu News