ఖమ్మం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూనే సొమ్మసిల్లిన షర్మిల.. వీడియో ఇదిగో!

  • పంట నష్టపోయిన రైతులకు ఇచ్చిన హామీ ఎప్పుడు అమలుచేస్తారని సీఎంను ప్రశ్నించిన షర్మిల
  • నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. పదివేల చొప్పున ఆర్థిక సాయం చేయాల్సి వస్తుందని చెప్పిన వైఎస్ఆర్ టీపీ చీఫ్
  • మాట్లాడుతుండగానే సొమ్మసిల్లిన షర్మిల.. కార్యకర్తల సపర్యలతో కోలుకున్న నేత
తెలంగాణలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఖమ్మంలో పర్యటిస్తున్న షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. మీడియాతో మాట్లాడుతూనే కళ్లు తిరిగిపడిపోయారు. షర్మిల పక్కనే ఉన్న మహిళ పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. చుట్టుపక్కల ఉన్న అనుచరులు, భద్రతా సిబ్బంది సపర్యలతో షర్మిల తేరుకున్నారు. 

ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను షర్మిల పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే జిల్లాలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ పర్యటన సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని షర్మిల గుర్తుచేశారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. పదివేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారన్నారు. 

ఆర్థిక సాయం ఈ మార్చిలోనే ఇస్తామని చెప్పిన కేసీఆర్.. ఏప్రిల్ పూర్తవుతున్నా ఇవ్వలేదని అన్నారు. వచ్చే నెలలోనైనా ఇస్తారా అంటూ మాట్లాడుతూనే షర్మిల కళ్లుతిరిగి పడిపోయారు. వెంటనే పక్కన ఉన్న మహిళ షర్మిలను పట్టుకుని నెమ్మదిగా కూర్చోబెట్టారు. కాసేపు విశ్రాంతి తీసుకునేలా చేయడంతో.. తిరిగి షర్మిల కోలుకున్నారు. ఉదయం నుంచి ఎండలో తిరగడం వల్ల ఆమె సొమ్మసిల్లి పడిపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నారని సమాచారం.



More Telugu News