​​దళితులపై అట్రాసిటీ కేసులు ఈ దుర్మార్గ ప్రభుత్వంలోనే చూస్తున్నాం: లోకేశ్

  • ఎమ్మిగనూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • కుండపోత వర్షంలోనూ ఆగని లోకేశ్
  • గొడుగు కూడా లేకుండా నడిచిన టీడీపీ యువనేత
  • వివిధ సామాజిక వర్గాలతో భేటీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 84వ రోజు ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. నందవరం శివార్లలో కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా లోకేశ్ తన పాదయాత్ర కొనసాగించారు. 

గొడుగును కూడా ఆయన తిరస్కరించారు. వర్షం తీవ్రమైన సమయంలో కొద్దిసేపు ఆగి వెళ్దామన్న నేతల సూచనను సైతం ఆయన పక్కనబెట్టి ముందుకు కదిలారు. యాత్ర ప్రారంభమయ్యాక ఎట్టి పరిస్థితుల్లో ఆగేదిలేదంటూ పాదయాత్ర కొనసాగించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీ యువనేతకు దారి పొడవునా ప్రజలు ఘనస్వాగతం పలికి తమ సమస్యలను చెప్పుకున్నారు. 

యువనేతను కలిసిన వడ్డెర సామాజిక వర్గీయులు 

ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరంలో వడ్డెర సామాజికవర్గీయులు లోకేశ్ ను కలిసి సమస్యలను విన్నవించారు. టీడీపీ పాలనలో తమకు కులవృత్తి పనిముట్లు అందేవని, బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అందేదని వెల్లడించారు. గతంలో మాకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని,. కమ్యూనిటీ హాళ్లు నిర్మించారని తెలిపారు. అయితే, వైసీపీ పాలనలో తమకు ఇవేవీ కనిపించడం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటిని పునరుద్ధరించాలని వడ్డెర సామాజిక వర్గీయులు లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత చంద్రబాబుది అని వెల్లడించారు. బీసీలను బ్యాక్ బోన్ అని పొగిడి నేడు వాళ్ల బ్యాక్ బోన్ విరిచిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. 

"వడ్డెర్ల నుండి వైసీపీ నేతలు లాక్కున్న క్వారీలను తిరిగి అప్పగిస్తాం. విధులు, నిధులు, కూర్చోడానికి కుర్చీలు కూడా లేని కార్పొరేషన్లు ఇచ్చి జగన్ మోసం చేశారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాన్ని మేము తలపెడితే వైసీపీ నిలిపేసింది. అధికారంలోకి వచ్చాక వాటిని మేము పూర్తి చేస్తాం. దామాషా ప్రకారం వడ్డెర కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తాం. వడ్డెర్లకు గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం" అని లోకేశ్ హామీ ఇచ్చారు.

మాదాసి కురవలు ఇబ్బంది పడుతున్న విషయం నాకు తెలుసు!

ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరంలో మాదాసి కురువ సామాజికవర్గ ప్రతినిధులు లోకేశ్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మాదాసి కురువ, మాదారి కురువలు 1991లో వచ్చిన ఏపీ ఎస్సీ లిస్టు 31వ నంబర్ జాబితాలో ఉన్నారని, ఆ తర్వాత తమను బీసీల్లో చేర్చి అన్యాయం చేశారని విమర్శించారు. 

"మాకు కురుబలగానే క్యాస్ట్ సర్టిఫికెట్లు వస్తున్నాయి. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్, నేషనల్ మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ వాళ్లు మాకు కురువ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. దీన్ని ఆధారంగా చేసుకుని తెలంగాణా ప్రభుత్వం మెమో నంబర్ 1268ను జారీ చేసింది. మీరు అధికారంలోకి వచ్చాక మాదాసి కురువలకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చి ఆదుకోవాలి. మా కులంలో చదువుకున్నవారు తక్కువగా ఉన్నారు. విద్యలో ప్రోత్సహించాలి" అని కోరారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... మాదాసి కురవలు ఎస్సీ సర్టిఫికేట్ విషయంలో ఇబ్బందిపడుతున్న అంశం తన దృష్టి కొచ్చిందని తెలిపారు. ఏపీ ఎస్సీ లిస్ట్ 31ని, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఆదేశాలను పరిశీలించి మాదాసి కురవలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దామాషా ప్రకారం కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. 

జగన్ రద్దు చేసిన దళిత పథకాలను పునరుద్ధరిస్తాం!

ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం రెయిన్ బో స్కూలు వద్ద హలహర్వి గ్రామ దళితులు లోకేశ్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు. వైసీపీ పాలనలో తమకు సంక్షేమ పథకాలు దూరం అయ్యాయని వాపోయారు. ఎస్సీ కార్పొరేషన్ నుండి సబ్సిడీ లోన్లు రావడం లేదని, నవరత్నాలకు తమ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి అన్యాయం చేస్తున్నారని వివరించారు. 

గత ప్రభుత్వం తమకు అమలుచేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వంలో రద్దు చేశారని, టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక రద్దయిన దళిత సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ...  ఎస్సీలకు మాత్రమే ఖర్చు చేయాల్సిన రూ.28,149 కోట్ల సబ్ ప్లాన్ నిధులను జగన్ దారిమళ్లించి దళితులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఎస్సీల సంక్షేమానికి టీడీపీ ప్రవేశపెట్టిన 27 పథకాలను జగన్ రద్దు చేశాడని ఆరోపించారు. 

"ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు పెట్టిన దుర్మార్గ ప్రభుత్వమిది. అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. దళితులపై బనాయించిన తప్పుడు కేసులు రద్దుచేస్తాం" అని భరోసా ఇచ్చారు.

యువనేతను కలిసిన బీసీ సామాజిక వర్గీయులు 

ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం ఆలయం వద్ద హలహర్వికి చెందిన బీసీ ప్రతినిధులు లోకేశ్ ను కలిసి సమస్యలను విన్నవించారు. జగన్ అధికారంలోకి వచ్చాక తమకు కులవృత్తి చేసుకునేందుకు పనిముట్లను ఇవ్వడం లేదని, గొర్రెలు మేపుకునే వారికి సబ్సిడీపై గొర్రెలు ఇవ్వడం లేదని ఆరోపించారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తమకు అన్యాయం చేస్తున్నారని వివరించారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చాక గతంలో మాదిరి ఆదరణ పథకంలో పనిముట్లు అందించాలని కోరారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు అందజేయాలని, బీసీలకు గతంలో ఇచ్చిన పథకాలు పునరుద్ధరించాలని కోరారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... బీసీలకు చెందాల్సిన రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన బీసీ ద్రోహి జగన్ అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు టీడీపీ ఇస్తే..వాటిని 24 శాతానికి జగన్ తగ్గించి అన్యాయం చేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తాం. ఆదరణ పథకాన్ని పునరుద్ధరించి కులవృత్తులవారికి పనిముట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. గతంలో బీసీలకు ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలన్నీ పునరుద్దరిస్తాంమని భరోసా ఇచ్చారు.

టీడీపీ వస్తే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల

ఎమ్మిగనూరు నియోజకవర్గం ముగతిలో నిరుద్యోగ యువకులు లోకేశ్ ను కలిసి సమస్యలు విన్నవించారు. తమ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉందని తెలిపారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఇచ్చిన నిరుద్యోగ భృతిని ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. మీరు అధికారంలోకి వచ్చాక మా ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... జగన్మోహన్ రెడ్డి నిర్వాకం కారణంగా గత నాలుగేళ్లలో 480 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చాక 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నిరుద్యోగ యువతను నిలువునా ముంచాడని విమర్శించారు. 

ఏటా జాబ్ నోటిఫికేషన్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేశారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. "ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం. రాయలసీమలో పరిశ్రమలు తెచ్చి యువతకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు కల్పించి, వలసలను నివారిస్తాం" అని భరోసా ఇచ్చారు.

====

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 1081.1 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 7.2 కి.మీ.*

*85వ రోజు (30-4-2023) యువగళం వివరాలు:*

*ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):*

సాయంత్రం

3.00 – ఎమ్మిగనూరు ఈఎస్ వి వే బ్రిడ్జి వద్ద విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

3.15 – ఎమ్మిగనూరు అనంతపద్మనాభ స్వామి దేవాలయం వద్ద డ్వాక్రా మహిళలతో భేటీ.

3.30 – ఎమ్మిగనూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వద్ద స్థానికులతో మాటామంతీ.

3.45 – ఎన్ఆర్ ఫంక్షన్ హాలు వద్ద కాంట్రాక్ట్ లెక్చరర్లతో సమావేశం.

4.00 – శ్రీనివాస సర్కిల్ లో ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.

4.10 – ఉప్పరవీధిలో ఉప్పర సామాజికవర్గీయులతో సమావేశం.

4.20 – వాల్మీకి సర్కిల్ వద్ద వాల్మీకి బోయలతో భేటీ.

4.30 – సోమప్ప సర్కిల్ వద్ద ముస్లింలతో సమావేశం.

4.40 – ఎస్ బిఐ సర్కిల్ వద్ద స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులతో భేటీ.

4.50 – మోర్ షాపింగ్ మాల్ వద్ద స్థానికులతో సమావేశం.

5.05 – ఎమ్మిగనూరు పార్కు వద్ద చేనేతలతో సమావేశం.

5.15 – ఎమ్మిగనూరు సొసైటీ బహిరంగసభ. యువనేత లోకేశ్ ప్రసంగం.

6.45 – ఎమ్మిగనూరు శివసర్కిల్ వద్ద స్థానికులతో మాటామంతీ.

7.50 – ఎమ్మిగనూరు శివారు విడిది కేంద్రంలో బస.



More Telugu News