విరామం ఎరుగని 74 ఏళ్ల తాత.. ఎంతో మంది యువతకు స్ఫూర్తి!

  • ముంబైలోని బోరివాలీ రైల్వే స్టేషన్లలో కర్చీఫ్ ల అమ్మకాలు
  • 17 ఏళ్లుగా విరామం ఎరుగకుండా అదే పని
  • పదవీ విరమణ చేసినా కష్ట పడడమే ఇష్టమంటున్న హసన్ అలీ 
ముంబైలోని బొరివాలీ రైల్వే స్టేషన్ ద్వారా తరచూ ప్రయాణించే వారికి 74 ఏళ్ల హసన్ అలీ అనే ఓ వృద్ధుడు సుపరిచితుడు. ఎందుకంటే అంత వయసులోనూ ఆయన తన కష్టార్జితాన్ని నమ్ముకుని జీవిస్తున్న వ్యక్తి. చేతి రుమాళ్లు (కర్చీఫ్ లు) విక్రయించడం ఆయన వ్యాపకం. ఇందులో పెద్ద విశేషం ఏముంది? అనుకోకండి. ఎందుకంటే ఆయన ఎంతో మంది యువతీ యువకులకు ఆదర్శనీయుడు. చేస్తున్న పని నుంచి విరమణ తీసుకుని 17 ఏళ్లు దాటిపోయింది. కానీ, ఉద్యోగానికే విరమణ కానీ పనికి కాదన్నది ఆయన తత్వం. అందుకే ఉద్యోగ విరమణ తర్వాత ఖాళీగా ఇంట్లో కూర్చోలేదు.

అప్పటి నుంచి బోరివాలీ రైల్వే స్టేషన్ ను ఉపాధి కేంద్రంగా చేసుకున్నాడు. నాటి నుంచి విరామం అన్నదే తెలియకుండా రోజూ కర్చీఫ్ లు విక్రయిస్తూ ఉన్నాడు. అఫీషియల్ హ్యుమన్స్ ఆఫ్ బాంబే అనే ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో హసన్ అలీ స్ఫూర్తినీయ అంశాన్ని షేర్ చేశారు. విక్రయించడాన్ని ఓ కళగా ఆయన పేర్కొన్నారు. ‘‘అమ్మడం ఓ కళ. ఓ వ్యక్తి తాను చెప్పకుండానే అతడికి ఏమి కావాలో నీవు తెలుసుకుని, అది విక్రయించాలి. ఎన్నో ఏళ్ల అనుభవంలో నేను ఇదే నేర్చుకున్నాను. నేను ఒక వ్యక్తి వైపు చూసినప్పుడు వారికి ఏమి కావాలో తెలుసుకోగలను’’అని హసన్ అలీ వివరించారు. (ఇన్ స్టా వీడియో కోసం)

కుటుంబ సభ్యులు ఎందుకు, ఏమి తక్కువ అయిందని నీవు రైల్వే స్టేషన్లో అమ్మకాలు చేస్తుంటావని ఆయన్ను అడుగుతుంటారు. తనకు భార్య, కుమారుడు, కోడలు, మనవరాలు ఉన్నారని, వారు ఎంతో ప్రేమిస్తుంటారని ఆయన చెప్పారు. వారంతా విశ్రాంతి తీసుకోవాలని కోరుతుంటారని తెలిపారు. అయినా, పని చేయడమే తనకు ఇష్టమని, ఖాళీగా కూర్చోవడం ఇష్టముండదని చెప్పారు. ఆయనకు ఎక్కువ మంది తరచూ కొనుగోలు చేసే కస్టమర్లే ఉన్నట్టు తెలిపారు. వారంతా ముద్దుగా కాకా అని పిలుస్తుంటారు. ఈ కాక ఎందరికో స్ఫూర్తినీయం అంటూ ఇన్ స్టా యూజర్లు కామెంట్ చేస్తున్నారు.


More Telugu News