రిలయన్స్ వాటాదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే జియో ఫైనాన్షియల్ లిస్టింగ్

  • ఒక రిలయన్స్ షేరుకు ఒక జియో ఫైనాన్షియల్ షేరు
  • దీపావళి నాటికి లిస్ట్ చేయాలన్న ప్రణాళిక
  • ఫైనాన్షియల్ సేవల్లో వేగంగా చొచ్చుకుపోయే వ్యూహం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లో షేర్లు కలిగిన వారికి గుడ్ న్యూస్. త్వరలోనే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లను లిస్ట్ చేయనున్నట్టు తెలిసింది. ఈ దీపావళి నాటికి (అక్టోబర్) జియో ఫైనాన్షియల్ షేర్లను లిస్ట్ చేయనున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం ఇది చాలా చిన్న స్థాయిలోనే వ్యాపారం నిర్వహిస్తోంది. కాకపోతే ముకేశ్ అంబానీ ఏ వ్యాపారంలో అయినా అగ్ర స్థానంలో ఉండాలని కోరుకుంటారు. అందుకే ప్రస్తుతం రిలయన్స్ లో భాగంగా ఉన్న దీన్ని డీ మెర్జ్ (వేరు చేసి) చేసి మార్కెట్లో లిస్ట్ చేయాలని భావిస్తున్నారు.

ప్రతి ఒక్క రిలయన్స్ షేరు ఉన్న వారికి ఒక జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు కేటాయించి, మార్కెట్లో లిస్ట్ చేయనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లోగడే ప్రకటించింది. కాకపోతే అది ఎప్పటిలోగా అన్నది తెలియజేయలేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు అక్టోబర్ లోపే దీన్ని లిస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. జియో లిస్టింగ్ తర్వాత రుణాలు, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ తదితర సేవల ద్వారా మార్కెట్లో పెద్ద ఎత్తున దూసుకుపోవాలన్న వ్యూహంతో పావులు కదుపుతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెలికంలో జియో విప్లవం సృష్టించిన మాదిరే.. జియో ఫైనాన్షియల్ ద్వారా ఆర్థిక సేవల మార్కెట్లోనూ చొచ్చుకుపోవాలనే వ్యూహంతో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News