ఏపీ రాజకీయాలపై అవగాహన లేకుండా రజనీకాంత్ మాట్లాడారు: మంత్రి రోజా

  • రజనీ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ బాధపడుతుందన్న రోజా
  • చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ ఏమన్నారో వీడియోలు పంపుతానని వెల్లడి
  • బాబు అధికారంలో లేనప్పుడే హైదరాబాద్‌ అభివ‌ృద్ధి చెందిందని వ్యాఖ్య
  • ‘విజన్ 2020’కి 23 సీట్లే వచ్చాయని ఎద్దేవా
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై రజనీకాంత్‌‌కు అవగాహన లేదని, ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ బాధపడుతుందని విమర్శించారు.

ఎన్టీఆర్‌ను అసెంబ్లీలో ఎలా అవమానించారో తెలిసేందుకు రజనీకి రికార్డులు పంపిస్తానని రోజా చెప్పారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ ఏమన్నారో అందరికీ తెలుసని, రజనీకాంత్‌కు తెలియకపోతే అందుకు సంబంధించిన వీడియోలు పంపిస్తానని చెప్పారు. రజనీకాంత్ తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. 

‘‘ఏపీ రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేకుండా రజనీకాంత్ మాట్లాడారు. చంద్రబాబు మోసగాడు, తడిగుడ్డతో గొంతుకోసే రకం అంటూ స్వయంగా ఎన్టీఆరే చెప్పారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు దారుణంగా కార్టూన్లు వేయించి అవమానించారు. అలాంటి వ్యక్తిని ఎన్టీఆర్ ఆత్మ ఆశీర్వదిస్తుందని, అలాంటి వ్యక్తిని చూసి సంతోషిస్తుందని అనడం చాలా బాధాకరం. రజనీకాంత్ తన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ అభిమానులను అవమానించారు’’ అని విమర్శించారు. 

‘‘2003లోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ కు ఆయనేం ముఖ్యమంత్రి కాలేదు. తెలంగాణ ఏర్పడింది. ఇప్పుడు 2023. అంటే 20 ఏళ్లుగా చంద్రబాబు అధికారంలో లేనప్పుడే హైదరాబాద్‌ అభివ‌ృద్ధి చెందింది. ఆయన ఎప్పుడు ఉండడో అప్పుడే అభివ‌ృద్ధి జరుగుతుంది. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణం. అంతే తప్ప చంద్రబాబు వల్ల కాదని రజనీకాంత్‌ తెలుసుకుంటే మంచిది’’ అని మంత్రి రోజా చెప్పారు. 

చంద్రబాబు విజన్‌ 2020 వల్ల టీడీపీకి 23 సీట్లు వచ్చాయని.. విజన్‌ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్‌కి తెలుసా అంటూ రోజా ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి.. తెలుగు ప్రజలలో ఉన్న గౌరవాన్ని రజనీ తగ్గించుకున్నారన్నారు.

ఇన్ని గొప్పలు చెప్పుకునే వాళ్లు 27 ఏళ్లలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ యుగపురుషుడు అన్న వారు ఎందుకు వెన్నుపోటు పొడిచారో చెప్పాలన్నారు. 2024లో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశమే లేదన్నారు.


More Telugu News