ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అమెరికా డాలర్‌: ఉదయ్ కోటక్

  • ఈటీ ఆవార్డ్స్ కార్యక్రమంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ కీలక వ్యాఖ్య
  • మనం డబ్బులు దాచుకునే నాస్ట్రో అకౌంట్లపై ఆంక్షలు విధించే హక్కు అమెరికాకు ఉందని వెల్లడి
  • డబ్బులు విత్‌డ్రా చేసుకోవద్దని అమెరికా అంటే మనం ఇరకాటంలో పడ్డట్టేనని వ్యాఖ్య
  • రిజర్వ్ కరెన్సీగా అమెరికా డాలర్‌కు ఉన్న శక్తి ఇదేనని వివరణ
  • రూపాయిని రిజర్వ్ కరెన్సీగా మార్చుకునే ఛాన్స్ భారత్ ముందుందని వెల్లడి
కోటక్  మహింద్రా బ్యాంక్ సీఈఓ, ఎండీ ఉదయ్ కోటక్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అమెరికా కరెన్సీయేనని వ్యాఖ్యానించారు. ఈటీ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్-2023 కార్యక్రమంలో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుతం మనందరి డబ్బూ నాస్ట్రో అకౌంట్లల్లో ఉంది. రేపొద్దున్న అమెరికాలో ఎవరైనా ఆ డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి వీల్లేదని ఆంక్షలు విధిస్తే మనం ఇరకాటంలో పడతాం. రిజర్వ్ కరెన్సీకి ఉన్న శక్తి అదే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రపంచం ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. భారత రూపాయిని రిజర్వ్ కరెన్సీగా మార్చే అవకాశం ప్రస్తుతం భారత్ ముందుందన్నారు. ఇది వందేళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఛాన్స్ అని వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం విదేశీ వాణిజ్యమంతా డాలర్లలో జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న విదేశీ నగదును డాలర్ల రూపంలోనే నిల్వ చేస్తాయి. అందుకే డాలర్‌ను రిజర్వ్ కరెన్సీ అని అంటారు. అంతేకాకుండా, కేంద్ర బ్యాంకులు ఈ మొత్తాన్ని అమెరికాలో నాస్ట్రో అకౌంట్లలో పెడతాయి. ఈ అకౌంట్లపై ఆంక్షలు విధించే అవకాశం అమెరికాకు ఉంది.


More Telugu News