సూడాన్‌లో భారత పైలట్ల డేరింగ్ ల్యాండింగ్.. నడిరాత్రి రన్‌వేపై లైట్లు లేకున్నా విమానాన్ని ఎలా ల్యాండ్ చేశారంటే..!

  • అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్
  • వాడి సయ్యద్నాలో చిక్కుకున్న 121 మంది భారతీయుల కోసం వెళ్లిన వాయుసేన విమానం
  • ల్యాండింగ్‌కు అనుకూల వాతావరణం లేకున్నా సాహసం చేసిన పైలట్లు
  • నైట్ విజన్ గాగుల్స్ సాయంతో సురక్షిత ల్యాండింగ్
అంతర్యుద్ధంతో సూడాన్ అల్లకల్లోలంగా ఉంది. ఆర్మీ, పారా మిలటరీ దళాల మధ్య పోరు రోజురోజుకు భీకరంగా మారుతోంది. దీంతో వేలాదిమంది సూడానీలు దేశం వీడుతున్నారు. అమెరికా, యూకే, సౌదీ సహా పలు దేశాలు అక్కడ చిక్కుకున్న తమ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొస్తున్నాయి. భారత్ కూడా ‘ఆపరేషన్ కావేరి’ చేపట్టి అక్కడ చిక్కుకున్న మనవారిని వెనక్కి తీసుకొస్తోంది. ఇప్పటికే పలువురు స్వదేశం చేరుకున్నారు. 

అక్కడే చిక్కుకుపోయిన మరో 121 మందిని వెనక్కి తీసుకెళ్లేందుకు వెళ్లిన ఓ విమాన పైలట్లు పెద్ద సాహసమే చేశారు. చిమ్మచీకటి అలముకున్న రాత్రివేళ లైట్లు కూడా లేని రన్‌వేపై విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసి ప్రశంసలు అందుకున్నారు. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం పోర్ట్ ఆఫ్ సూడాన్‌కు భారత ప్రభుత్వం నౌకను పంపింది. అయితే అక్కడికి చేరుకునే మార్గంలేని 121 మంది వాడి సయ్యిద్నాలో చిక్కుకుపోయారు. దీంతో వారి కోసం భారత వాయుసేనకు చెందిన సి-130జే హెర్య్కులస్ రవాణా విమానం బయలుదేరింది. 

వాడి సయ్యద్నా ఎయిర్ బేస్‌కు భారత విమానం చేరుకుంది. రాత్రిపూట అక్కడ ల్యాండ్ కావడానికి అనుకూలమైన వాతావరణం లేదు. నేవిగేషన్ కానీ, ల్యాండింగ్ లైట్లు కానీ లేవు. అయితే, అక్కడి వరకు వెళ్లిన విమానాన్ని వెనక్కి మళ్లించేందుకు ఇష్టపడని పైలట్లు ధైర్యం చేశారు. నైట్ విజన్ గాగుల్స్‌ను ఉపయోగించి విమానాన్ని సురక్షితంగా ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండ్ చేశారు. 

అంతకుముందు సిబ్బంది తమ ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్‌ఫ్రా-రెడ్ సెన్సార్లను ఉపయోగించి ఆ చిన్న రన్‌వేపై ఎలాంటి ఆటంకాలు లేవని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ధైర్యం చేసి నైట్ విజన్ గాగుల్స్‌ సాయంతో విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయ్యాక ముందుజాగ్రత్త చర్యగా ఇంజిన్లను ఆఫ్ చేయకుండా రన్నింగ్‌లోనే ఉంచారు. 

విమానం ల్యాండయ్యాక  వాయుసేన ప్రత్యేక దళానికి చెందిన 8 మంది గరుడ కమాండోల రక్షణలో ప్రయాణికులు విమానంలోకి ఎక్కారు. కాగా, ఆపరేషన్ కావేరిలో భాగంగా ఇప్పటి వరకు 1,360 మందిని స్వదేశానికి సురక్షితంగా తరలించారు.


More Telugu News