12వ తరగతిలో 90 శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకివ్వనన్న యజమాని

  • నెట్టింట వైరల్ కథనం
  • తన బంధువుకు 12వ తరగతిలో 90 శాతం మార్కులు లేవంటూ ఓ వ్యక్తి పోస్ట్
  • దీంతో, ఫ్లాట్ యజమాని అతడికి  ఫ్లాట్ అద్దెకు ఇవ్వలేదని వెల్లడి
బెంగళూరులో అద్దె ఇళ్లల్లో ఉండేవారి కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! బాధితులు తమ వెతలను నిత్యం నెట్టింట్లో పంచుకుంటూ ఉంటారు. ఇలాంటి ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తన బంధువుకు ఇంటర్‌లో 90 శాతానికి పైగా మార్కులు రాని కారణంగా ఇంటి యజమాని అద్దెకు ఫ్లాట్ ఇవ్వలేదంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టుపై ప్రస్తుతం పెద్ద చర్చనే జరుగుతోంది. ఇందుకు సంబంధించి తన బంధువు, ఇళ్ల బ్రోకర్‌తో జరిపిన వాట్సాప్ సంభాషణ కూడా అతడు నెట్టింట షేర్ చేశాడు. 

ఓ మధ్యవర్తి ద్వారా తన కజిన్ ఓ ఫ్లాట్ యజమానిని సంప్రదించినట్టు అతడు పేర్కొన్నాడు. ఆ తరువాత ఫ్లాట్ యజమాని కోరిక మేరకు లింక్డ్‌ఇన్ ప్రొఫైల్, జాబ్‌ జాయినింగ్ లెటర్, విద్యార్హతలు, పాన్, ఆధార్ కార్డులతో పాటూ తన గురించి వివరిస్తూ ఓ 300 పదాల వ్యాసం కూడా తన బంధువు రాసి పంపించాడని తెలిపాడు.  రెండు రోజుల తరువాత మధ్యవర్తి నుంచి తన కజిన్‌కు మేసేజ్ వచ్చిందని పేర్కొన్నాడు. ఫ్లాట్ యజమాని ఇల్లు అద్దెకు ఇవ్వనన్నాడని మధ్యవర్తి తన బంధువుతో చెప్పినట్టు వెల్లడించాడు. 

12వ తరగతిలో 90 శాతం మార్కులు రాకపోవడంతోనే ఫ్లాట్ అద్దెకు ఇవ్వనని యజమాని చెప్పినట్టు మధ్యవర్తి పేర్కొనడంతో తన బంధువుకు దిమ్మతిరిగినంత పనైందని వాపోయాడు. తన కజిన్‌కు కేవలం 75 శాతమే వచ్చాయని చెప్పిన అతడు,  మార్కులు భవిష్యత్తును నిర్ణయించవేమో గానీ బెంగళూరులో అద్దెకు ఫ్లాట్ దొరికేదీ లేనిదీ కచ్చితంగా నిర్ణయిస్తాయని చివర్లో చమత్కరించాడు.


More Telugu News