నా కుమార్తె తన భర్తను ప్రధాన మంత్రిని చేసింది: సుధామూర్తి
- తన భర్తను వ్యాపారవేత్తను చేశానన్న సుధామూర్తి
- తన కుమార్తె మాత్రం తన భర్తను బ్రిటన్ ప్రధానిని చేసిందని ప్రశంస
- కారణం భార్య మహిమలేనని వ్యాఖ్య
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య, సమాజ సేవకురాలు సుధామూర్తి తన కుమార్తె విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను నా భర్తను ఓ వ్యాపారవేత్తగా చేశాను. నా కుమార్తె తన భర్తను బ్రిటన్ ప్రధానిని చేసింది. కారణం భార్య మహిమలే. భర్తను ఓ భార్య ఎలా మార్చగలదో చూడండి. నేను మాత్రం నా భర్తను మార్చలేకపోయాను. నేను నా భర్తను వ్యాపారవేత్తను చేస్తే, నా కుమార్తె మాత్రం తన భర్తను బ్రిటన్ ప్రధానిని చేసింది’’అని ఆమె వ్యాఖ్యానించారు. నారాయణమూర్తి, సుధామూర్తి కుమార్తె అయిన అక్షతామూర్తిని ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ 2009లో వివాహం చేసుకున్నారు. రిషీ సునాక్ చిన్న వయసులోనే బ్రిటన్ ప్రధాని కావడం వెనుక తన కుమార్తె చూపించిన ప్రభావమే కారణమన్నది సుధామూర్తి వివరణగా ఉంది.
అక్షతామూర్తి తన భర్తను ఎన్నో విధాలుగా ప్రభావితం చేసినట్టు సుధామూర్తి చెప్పారు. ముఖ్యంగా ఆహారం విషయంలో ఆమె ఎంతో ప్రభావితం చేసినట్టు తెలిపారు. ‘‘ఇన్ఫోసిస్ ను గురువారం ప్రారంభించారు. మా అల్లుడి కుటుంబం ఇంగ్లండ్ లో 150 ఏళ్లుగా (వారి పూర్వీకుల కాలం నుంచి) ఉంటోంది. వారు మతపరమైన ఆచారాలు కలిగిన వారు. నా కుమర్తెను వివాహం చేసుకున్న తర్వాత ప్రతిదీ గురువారం ఎందుకు ప్రారంభిస్తారు? అని అడిగారు. మేము రాఘవేంద్రస్వామిని ఆరాధిస్తాం అని చెప్పింది. దాంతో అతడు కూడా గురువారం ఉపవాసం ఉంటాడు. నా అల్లుడు తల్లి ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే, అల్లుడు గురువారం ఉపవాసం ఉంటారు’’అని సుధామూర్తి వివరించారు.