పవర్ ప్లే సీఎస్కే కొంప ముంచింది: ఆస్ట్రేలియా దిగ్గజం
- రాజస్థాన్ జట్టు ప్రొఫెషనల్ గా ఆడిందన్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
- యశస్వి జైస్వాల్ ఆటతీరుకు ప్రశంసలు
- చెన్నై జట్టు పవర్ ప్లేలో మరింత మెరుగ్గా ఆడాల్సిందన్న అభిప్రాయం
రాజస్థాన్ జట్టు చేతిలో చెన్నై మట్టి కరిచింది. గురువారం జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ చేతిలో 32 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. నిన్నటి మ్యాచ్ చూసిన వారు ఒకవైపు రాజస్థాన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ను మెచ్చుకుంటూనే, మరోవైపు చెన్నై జట్టు ఆట తీరు పట్ల నిట్టూర్చి ఉంటారు. ఎందుకంటే పవర్ ప్లేలో చెన్నై బౌలర్లను రాజస్థాన్ ఓపెనర్లు చీల్చి చెండాడారు. వచ్చిన ప్రతి బంతిని చావబాదారు. అయితే సిక్సర్ లేదంటే బౌండరీ. 12 రన్ రేటు సాధించారు. జైస్వాల్ కేవలం 43 బంతుల్లో 77 పరుగులు రాబట్టాడు. ఎనిమిది బౌండరీలు, నాలుగు సిక్సర్లు పీకాడు. అయినా కానీ సీఎస్కే సారథి ధోనీ బౌలర్ల పరంగా పెద్ద మార్పులు కూడా చేయలేదు. ఆకాశ్ సింగ్, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్ పాండేతోనే పవర్ ప్లే ముగించాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాఘన్ కూడా సీఎస్కే ఓటమికి పవర్ ప్లేనే కారణమని పేర్కొన్నాడు. రాజస్థాన్ జట్టు వరుసగా రెండు ఓటములు చూసిన తర్వాత గెలుపు కసితో ఉన్నట్టు చెప్పాడు. ‘‘రెండు ఓటముల తర్వాత ఇలాంటి విజయం అవసరమే. వారు ఎంతో ప్రొఫెషనల్ గా ఆడారు. పవర్ ప్లేలో జైస్వాల్ అద్భుతంగా ఆడాడు. పవర్ ప్లే చెన్నై జట్టుకు చిత్రంగా ఉంది. వారు కేవలం 42 పరుగులే సాధించగా, పవర్ ప్లే చివర్లో కాన్వే వికెట్ కోల్పోయారు. మొదటి ఆరు ఓవర్లలో వారు మరింత దూకుడుగా ఆడాల్సింది. 2-3 వికెట్లు కోల్పోయినా 60 పరుగులు రాబట్టి ఉంటే మంచి రన్ రేటు ఉండేది. పవర్ ప్లేలో 7 రన్ రేటు ఉంటే 200 స్కోరును ఛేదించిన జట్లు పెద్దగా లేవు’’అని వాఘన్ పేర్కొన్నాడు.