గూగుల్ ఉద్యోగులను కంట్రోల్ చేయలేక సుందర్ పిచాయ్‌ ఇబ్బందులు

  • ‘ది ఇన్ఫర్మేషన్’ మీడియా సంస్థ కథనం
  • ఉద్యోగులను తాను నియంత్రించలేకపోతున్నానని సుందర్ పేర్కొన్నట్టు వెల్లడి
  • సుందర్ పిచాయ్ మేనేజ్‌మెంట్‌లో సమస్యలు ఉన్నట్టు పేర్కొన్న సంస్థ
గూగుల్ ఉద్యోగులను నియంత్రించడంలో సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ఇబ్బంది పడుతున్నారా? అంటే అవుననే అంటోంది ‘ది ఇన్ఫర్మేషన్’ అనే మీడియా సంస్థ. కొన్నేళ్ల క్రితమే సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని కొందరితో చెప్పుకున్నట్టు వెల్లడించింది. సంస్థలోని ఉన్నతోద్యోగుల మధ్య ఆధిపత్య పోరాటాలు, ప్రభుత్వాల నుంచి ఎదురవుతున్న విధానపరమైన సవాళ్లు, కొందరు ఉద్యోగుల తిరుగుబాటు ధోరణి వెరసి తనపై ఒత్తిడి పెంచాయని సుందర్ పిచాయ్ పేర్కొన్నట్టు ది ఇన్ఫర్మేషన్ సంస్థ ప్రచురించింది. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో తన బాధ్యతలను మరొకరికి అప్పగించాలని కూడా అప్పట్లో ఆయన భావించినట్టు వెల్లడించింది. 

లేఆఫ్స్‌ కారణంగా ప్రస్తుతం గూగుల్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు, గూగుల్‌కు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో వృద్ధి లేకపోవడం కూడా కంపెనీపై ప్రభావం చూపిస్తోంది. గూగుల్ సంప్రదాయిక సెర్చ్ ఇంజన్ కంటే సమర్థవంతమైన ఏఐ ఆధారిత ఉత్పత్తులను ప్రత్యర్థి సంస్థలు రంగంలోకి దింపాయి. గూగుల్‌ ప్రకటనల ఆదాయంపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుందన్న ఆందోళన సంస్థలో వ్యక్తమవుతోంది. ప్రకటనల ద్వారా గూగుల్‌కు ప్రస్తుతం ఏటా సుమారు 150 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోందని సమాచారం. అయితే, ఏఐ రాకతో ఈ రంగంలో గూగుల్ వెనకబడినట్టు కనిపిస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకాలం గూగుల్ ప్రకటనల ఆదాయం దండిగా ఉండటంతో పిచాయ్ మేనేజ్‌మెంట్ శైలిలో సమస్యలు ఉన్నప్పకీ గూగుల్ పెద్దలు పట్టించుకోలేదని ‘ది ఇన్ఫర్మేషన్’ సంస్థ ప్రచురించింది.


More Telugu News