పవన్ తన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి: కేఏ పాల్

  • వివేకా హత్యకేసు విచారణలో డ్రామా నడుస్తోందన్న పాల్
  • వివేకాను ఎవరు? ఎందుకు? చంపారో ప్రజలకు తెలియాలన్న ప్రజాశాంతి పార్టీ చీఫ్
  • తెలంగాణ సచివాలయాన్ని హిట్లర్ చనిపోయిన రోజున ప్రారంభిస్తున్నారంటూ మండిపాటు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని ఆ పార్టీ చీఫ్ కేఏ పాల్ కోరారు. నిన్న విజయవాడలో విలేకరులతో మాట్లాడిన పాల్.. పవన్ కనుక తనతో వస్తే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామన్నారు. పవన్ మళ్లీ బీజేపీతో ఎందుకు జతకట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అలాగే, ఏపీ ప్రభుత్వంపైనా పాల్ విరుచుకుపడ్డారు. 3 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే గంగవరం పోర్టును రూ. 3 వేల కోట్లకు అదానీకి అన్యాయంగా అమ్మేశారని మండిపడ్డారు. 

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై మాట్లాడుతూ.. ఈ కేసు విచారణలో డ్రామా నడుస్తోందన్నారు. బాధితులకు న్యాయం చేయాలని తాను ఇప్పటికే సీబీఐ జాయింట్ డైరెక్టర్‌ను కలిసి కోరినట్టు వెల్లడించారు. అలాగే, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశానని చెప్పారు. 

వివేకాను ఎవరు? ఎందుకు? చంపారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఇది కుటుంబ హత్యా? లేదంటే, రాజకీయపరమైన హత్యా అన్నది తేలాలన్నారు. కాగా, తెలంగాణ సచివాలయాన్ని అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించాలని తాను కేసీఆర్‌ను కోరానని, కానీ ఆయన హిట్లర్ చనిపోయిన రోజున ప్రారంభిస్తున్నారని కేఏ పాల్ ఎద్దేవా చేశారు.


More Telugu News