​​చెన్నై చిన్నబోయింది... ప్రతీకారం కాదు, మళ్లీ పరాభవమే!​​​​​​​​​​​​​​​​​​​​​

  • రాజస్థాన్ రాయల్స్ చేతిలో 32 పరుగుల తేడాతో చెన్నై ఓటమి
  • 203 పరుగుల లక్ష్యఛేదనలో 170 పరుగులు చేసిన చెన్నై
  • ధాటిగా ఆడిన రుతురాజ్, శివమ్ దూబే, మొయిన్ అలీ, జడేజా
  • కీలక సమయాల్లో వికెట్లు తీసి చెన్నైకి కళ్లెం వేసిన జంపా, అశ్విన్
  • ఈ సీజన్ లో చెన్నైపై రెండో విజయం సాధించిన రాజస్థాన్
రాజస్థాన్ రాయల్స్ అన్ని రంగాల్లో ఆధిప్యతం చెలాయించిన వేళ చెన్నై సూపర్ కింగ్స్ చిన్నబోయింది. సొంతగడ్డ జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 32 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. 

ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ కు ఇది రెండో విజయం. ఏప్రిల్ 12న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లోనూ రాజస్థాన్ రాయల్సే గెలిచింది. ఈ మ్యాచ్ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ధోనీ సేనకు ఇవాళ మరో పరాభవం ఎదురైంది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 77, ధృవ్ జురెల్ 34, దేవదత్ పడిక్కల్ 27 (నాటౌట్) పరుగులు చేశారు. అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేసింది. 

యువ ఆటగాడు శివమ్ దూబే పోరాడినా ఫలితం దక్కలేదు. దూబే 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేశాడు. మొయిన్ అలీ 12 బంతుల్లో 23 పరుగులు చేయగా, జడేజా 15 బంతుల్లో 23 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు, ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 47 పరుగులు చేశాడు. 

కీలక సమయాల్లో వికెట్లు తీసిన రాజస్థాన్ బౌలర్లు చెన్నై ఛేదనను సమర్థంగా అడ్డుకున్నారు. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 3, అశ్విన్ 2, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. చెన్నై ఇన్నింగ్స్ లో అంబటి రాయుడు (0) డకౌట్ కాగా, ఓపెనర్ డెవాన్ కాన్వే 8, రహానే 15 పరుగులు చేసి నిరాశపరిచారు. 

ఈ మ్యాచ్ లో విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటిదాకా టాప్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానానికి పడిపోయింది.


More Telugu News