జగన్ కాన్వాయ్ కి అడ్డంపడిన రైతులే మనకు ఆదర్శం: నారా లోకేశ్

  • మంత్రాలయం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • 82వ రోజు కొనసాగిన యువగళం
  • బీసీ రక్షణ కోసం చట్టాన్ని తీసుకువస్తామన్న లోకేశ్
  • బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారీచేస్తామని వెల్లడి
  • వలస కూలీల కష్టం చూస్తుంటే గుండె త‌రుక్కుపోతోందని ఆవేదన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 82వ రోజు మంత్రాలయం అసెంబ్లీ నియోకజకవర్గంలో హోరెత్తింది. మాధవరం శివారు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు దారిపొడవునా జనం నీరాజనాలు పట్టారు. రాయచూర్ సర్కిల్, చెట్నిహల్లి మీదుగా పాదయాత్ర మంత్రాలయం చేరుకుంది. మంత్రాలయంలో యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. 

మధ్యాహ్నం భోజన విరామానంతరం పాదయాత్ర కొనసాగించిన యువనేత మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రాలయం శివార్లలో విడిది కేంద్రానికి చేరుకుంది.

ఆధార్ కార్డు మాదిరిగానే బీసీలకు శాశ్వత సర్టిఫికెట్లు!

ఆధార్ కార్డు మాదిరిగానే బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారీచేస్తామని నారా లోకేశ్ పేర్కొన్నారు. మంత్రాలయం ఎబోడ్ హోటల్ వద్ద బీసీలతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ... ఫోన్లో ఒక్క బటన్ నొక్కగానే ప్రభుత్వమే మీ ఇంటికి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేసే విధానం తీసుకొస్తాం అని వెల్లడించారు. 

"జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలపై అడ్డగోలుగా కేసులు పెడుతోంది, ఎవరూ భయపడాల్సిన పనిలేదు, నమ్మిన సిద్ధాంతాల కోసం అందరూ కలసికట్టుగా పోరాడాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల భద్రత కోసం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. దామాషా ప్రకారం బీసీ ఉప కులాలకు నిధులు కేటాయిస్తాం. సబ్సిడీ రుణాలు అందిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం తిరిగి ప్రారంభిస్తాం. 

జగన్ కాన్వాయ్ కి అడ్డం పడుకొని నిరసన తెలిపిన రైతుల్ని ఆదర్శంగా తీసుకొని అందరూ ప్రభుత్వం పై పోరాడాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కనకదాసు జయంతి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం. మాదాసి కురబలకు ఎస్సీ సర్టిఫికేట్ పై తప్పకుండా మేము సర్టిఫికేట్లు ఇస్తాం. బీరప్ప గుడుల నిర్మాణాలకు ప్రభుత్వ నిధులు కేటాయించి, అర్చకులకు జీతాలందిస్తాం" అని హామీల వర్షం కురిపించారు.

ఉపకులాల వారీగా కమ్యూనిటీ హాళ్లు

ఉప కులాల వారీగా ముందు నియోజకవర్గం స్థాయిలో, ఆ తరువాత మండల స్థాయిలో కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తామని లోకేశ్ వెల్లడించారు. బోయ, వాల్మీకి లను జగన్ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. 

"ఎన్నోసార్లు జగన్ ప్రధానిని కలిశారు. ఒక్క సారి అయినా బోయ, వాల్మీకి లను ఎస్టీల్లో చేర్చాలని అడిగారా? అంత మంది ఎంపీలు ఉన్నారు ఒక్క రోజైనా పార్లమెంట్ లో ఈ అంశం గురించి మాట్లాడారా? టీడీపీ హయాంలో సత్యపాల్ కమిటీ వేసి అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. జగన్ నాలుగేళ్లుగా డ్రామాలు ఆడి ఇప్పుడు కేవలం 4 జిల్లాలో ఉన్న బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చాలని కొత్త తీర్మానం చేసి మీకు తీరని అన్యాయం చేశారు. 

కల్లుగీత కార్మికుల పొట్ట కొట్టాడు జగన్. చెట్లను కొట్టేయడం తో పాటు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్ తన జె-బ్రాండ్ల మద్యం అమ్ముకోవడానికి కల్లు గీత కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నీరా కేఫ్ లు ఏర్పాటు చేస్తాం. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం. తాటి చెట్ల పెంపకాన్ని ఉపాధి హామీతో అనుసంధానిస్తాం" అని స్పష్టం చేశారు.

రజకులకు వాషింగ్ మెషీన్లు, ఉచిత విద్యుత్

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రజకులకు వాషింగ్ మెషీన్, ఐరన్ బాక్సులు అందజేశామని లోకేశ్ వెల్లడించారు. దోబి ఘాట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. "టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాషింగ్ మెషీన్ తో పాటు రజకులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తాం. రజకులకి ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేసింది జగన్. 

మంత్రాలయం లో మత్స్యకారులను వేధిస్తున్నాడు ఇక్కడ ఎమ్మెల్యే విష నాగు. వైసీపీ పెత్తందారుల చేతిలోకి వెళ్లిపోయిన చెరువులు అన్ని తిరిగి మత్స్యకారులకు కేటాయిస్తాం. మత్స్యకారుల పొట్ట కొట్టేలా జగన్ తెచ్చిన జీవోలు అన్నీ రద్దు చేస్తాం. బీసీలకు నిజమైన రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చింది టీడీపీ వలనే" అని పేర్కొన్నారు.

వ‌ల‌స‌ల‌తో ప‌ల్లె క‌న్నీరు పెడుతోంది!

వలసకూలీల కష్టం చూస్తుంటే గుండె త‌రుక్కుపోతోందని నారా లోకేశ్ భావోద్వేగానికి గురయ్యారు. గురువారం మంత్రాల‌యం నియోజ‌క‌వ‌ర్గం మాధ‌వ‌రం మీదుగా పాద‌యాత్ర చేస్తుండగా తారసపడిన వలసకూలీలను లోకేశ్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుటుంబాల‌న్నీ వ‌ల‌స‌లు పోతుంటే ప‌ల్లె క‌న్నీరు పెడుతోందని విచారం వ్యక్తం చేశారు. 

ఇంటిల్లిపాదీ మండుటెండ‌ల్లో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లి తిరిగి వస్తున్న దృశ్యాలు ఆందోళ‌న‌కి గురిచేస్తున్నాయని తెలిపారు. బ‌డిలో చ‌క్క‌టి రాత‌లు నేర్చాల్సిన చిట్టిచేతులు మ‌ట్టి ప‌నుల‌కి త‌ల్లిదండ్రుల‌తో త‌ర‌లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెతుకు కోసం, బ‌తుకు కోసం వంద‌ల కిలోమీట‌ర్లు ప్ర‌మాద‌క‌ర ప్ర‌యాణం చేస్తున్న వ‌ల‌స జీవులు మ‌న ప‌ర‌దాల హెలికాప్ట‌ర్ సీఎం గారికి క‌నిపించే అవ‌కాశ‌మే లేదని లోకేశ్ వ్యాఖ్యానించారు. 

"డీసీఎం వ్యానులో పిల్ల‌ల‌తో క‌లిసి వలస వెళ్లి వస్తున్న కుటుంబాలు ఎదుర‌య్యాయి. వారితో మాట్లాడేందుకు వ్యాన్ ఎక్కాను. వ్య‌వ‌సాయానికి నీటివ‌స‌తి లేక‌, చేసేందుకు ప‌నిలేక‌, ధ‌ర‌లు భార‌మై తెలంగాణ ప్రాంతానికి, గుంటూరుకి వెళ్లి పనులు చేసుకొని తిరిగి వస్తున్నామని చెప్పారు. ఏడాదిలో ఆరు నెలలు పనులు కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన దుస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ వ‌ల‌స‌లు జ‌గ‌న్ రెడ్డి విధ్వంస పాల‌న విష‌ ఫ‌లితం. తెలుగుదేశం ప్ర‌భుత్వం రాగానే యుద్ధ‌ప్రాతిప‌దిక‌న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వ్య‌వ‌సాయానికి నీరందిస్తాం. స్థానికంగానే ఉపాధి దొరికే మార్గాలు చూపుతాం. వ‌ల‌స క‌ష్టాలు లేకుండా చేస్తాం. ప‌ల్లె క‌న్నీరు తుడుస్తాం" అని లోకేశ్ భరోసా ఇచ్చారు.


*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 1059.7 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 13.6 కి.మీ.*

*83వ రోజు (28-4-2023) యువగళం వివరాలు:*

*ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):*

ఉదయం

7.00 – మంత్రాలయం శివార్ల నుంచి పాదయాత్ర ప్రారంభం.

7.30 – కల్లుదేవకుంటలో రైతులతో భేటీ.

8.20 – ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

9.10 – ఇబ్రహీంపట్నం చర్చి వద్ద స్థానికులతో సమావేశం.

9.20 – ఇబ్రహీంపట్నం గ్రామచావిడి వద్ద స్థానికులతో భేటీ.

9.55 – కొట్టాల క్రాస్ వద్ద నడికైరవాడ గ్రామస్తులతో సమావేశం.

10.45 – మాచాపురం శివార్లలో రైతులతో ముఖాముఖి.

11.45 – మాచాపురం శివార్లలో భోజన విరామం.

సాయంత్రం

4.00 – మాచాపురం శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.45 – మాచాపురంలో స్థానికులతో మాటామంతీ.

4.55 – మాచాపురం పంచాయితీ ఆఫీసు వద్ద ఎస్సీలతో భేటీ.

5.05 – మాచాపురం ఆటోస్టాండ్ వద్ద స్థానికులతో సమావేశం.

5.30 – మాచాపురం శివార్లలో ఎస్సీ, బిసి సామాజికవర్గీయులతో భేటీ.

6.20 – నందవరం ఎస్సీ కాలనీలో దళితులతో సమావేశం.

6.35 – నందవరం చర్చి వద్ద స్థానికులతో సమావేశం.

7.25 – నందవరం శివారు విడిది కేంద్రంలో బస.


More Telugu News