మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్టులు.. గ్రేడ్ ‘ఏ’ ముగ్గురికే!

  • మూడు గ్రేడ్లలో 17 మందికి అవకాశం కల్పించిన బీసీసీఐ
  • హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మకు గ్రేడ్ ‘ఏ’
  • అయితే ఏయే గ్రేడ్లకు ఎంతెంత చెల్లిస్తారనే వివరాలను వెల్లడించని సంస్థ
మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్టులను ప్రకటించింది. మూడు గ్రేడ్లలో 17 మందికి అవకాశం కల్పించింది. అయితే ఆయా క్రికెటర్లకు ఏయే గ్రేడ్లకు ఎంతెంత చెల్లిస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. మరోవైపు ‘ఏ’ గ్రేడ్ లో ముగ్గురికి మాత్రమే చోటు దక్కడం గమనార్హం.  

టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆల్ రైండర్ దీప్తి శర్మకు ‘ఏ’ గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. గ్రేడ్ ‘బీ’ కాంట్రాక్టు ఐదుగురికి దక్కింది. పేసర్ రేణుకా సింగ్, బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, స్పిన్నర్ రాజేశ్వర్ గైక్వాడ్ ఇందులో ఉన్నారు. 

ఇక గ్రేడ్ ‘సీ’లో 9 మంది ఉన్నారు. సబ్బినేని మేఘన, అంజలి సర్వాని, మేఘనా సింగ్, దేవికా వైద్య, పూజా వస్త్రాకర్, స్నేహ రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యస్తికా భాటియా ఉన్నారు. వీరిలో సబ్బినేని మేఘన, అంజలి.. తెలుగు క్రికెటర్లు. 

గతేడాది ప్రకటించిన కాంట్రాక్టు ప్రకారం.. గ్రేడ్ ‘ఏ’ ప్లేయర్లకు ఏడాదికి రూ.50 లక్షలు చెల్లించారు. గ్రేడ్ ‘బీ’లో ఉన్న వారు రూ.30 లక్షలు అందుకున్నారు. గ్రేడ్ ‘సీ’ ప్లేయర్లకు రూ.10 లక్షల చొప్పున వార్షిక వేతనంగా చెల్లించారు. ఈ ఏడాది ఈ వేతనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.


More Telugu News