బైజూస్ లో రూ. 700 కోట్లు స్కామ్ చేశారు: ఏపీ ప్రభుత్వంపై నాదెండ్ల ఆరోపణలు
- పవన్, తాను ఢిల్లీకి వెళ్లినప్పుడు కొన్ని విషయాలు తెలిశాయన్న నాదెండ్ల
- పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శ
- వచ్చే నెలలో పోలవరంను పవన్ పరిశీలిస్తారని వెల్లడి
ఎడ్ టెక్ సంస్థ బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా విద్యను బోధించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. దీనిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. బైజూస్ పేరుతో రూ. 700 కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ తీరు ఇదేనా అని ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్, తాను ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయని మనోహర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తెలిసిందని చెప్పారు. 45.72 మీటర్ల ఎత్తు ఉండాల్సిన ప్రాజెక్టును 41.15 మీటర్ల మేర తొలి దశలో పూర్తి చేస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయితే... పోలవరం అధారిటీ నుంచి శాంక్షన్ రాకపోయినా ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ. 2,030 కోట్లు విడుదలకు జీవో విడుదల చేయడం అవినీతి కాదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు వల్ల లక్ష కుటుంబాలు నిర్వాసితులైతే... 24 వేల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఇచ్చేసి చేతులు దులుపుకుందామని చూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే నెలలో పోలవరం ప్రాజెక్టును పవన్ కల్యాణ్ పరిశీలిస్తారని చెప్పారు.