ఆర్ సీబీపై చిన్నారి ప్లకార్డు.. కామెంట్లు వైరల్!

  • కోల్ కతాతో మ్యాచ్ లో పోరాడి ఓడిన బెంగళూరు
  • ప్లకార్డు పట్టుకుని అందరినీ ఆకర్షించిన ఓ చిన్నారి
  • ‘ట్రోఫీని ఆర్సీబీ గెలుచుకునే దాకా స్కూల్ కు వెళ్లను’ అని ఉండటంపై కామెంట్ల వర్షం
ఇంతవరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ గెలవకున్నా ఆర్ సీబీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) అంటే ఇష్టపడే అభిమానులు ఎందరో ఉన్నారు. ఆర్సీబీ గెలిస్తే ఎంత సంబరపడతారో.. ఓడినప్పుడు అంతే బాధపడతారు. కొందరైతే ఏడ్చేస్తారు కూడా. ఈ సారైనా ఆర్సీబీ కప్ కొడుతుందని అభిమానులు ఆశపడటం, చివరికి నిరాశకు గురికావడం.. 2007 నుంచి ఇదే పరిస్థితి.

నిన్న కోల్ కతాతో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్ లో గెలిచే అవకాశం ఉన్నా ఓటమిని మూటగట్టుకుంది బెంగళూరు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ చిన్నారి పట్టుకున్న ప్లకార్డు అందరినీ ఆకర్షించింది. సోషల్ మీడియాలో వైరల్ గానూ మారింది.

‘‘ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ గెలుచుకునే దాకా నేను స్కూల్ కు వెళ్లను’’ అని ప్లకార్డుపై రాసి ఉంది. ఈ క్యూట్ ఫొటో చాలా మందికి నచ్చేసింది. నెటిజన్ల నుంచి కామెంట్లు పోటెత్తాయి. కొందరు మీమ్స్, వీడియోలు పెడుతున్నారు. 

చిన్నారి ఫొటోకు ఓ వీడియోను జత చేసిన యూజర్.. ‘ఇప్పుడు.. 20 ఏళ్ల తర్వాత (చాయ్ చేస్తూ)’ అంటూ అందులో చెప్పుకొచ్చాడు. మరొకరేమో.. ‘చిన్నారి పెద్దయ్యాక ఇలా’ అంటూ ఆలు, ఉల్లి అమ్ముతున్న నానా పటేకర్ ఫొటోను ట్వీట్ చేశారు.

ఈ సీజన్ లో ఇప్పటిదాకా 8 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ.. నాలుగు గెలిచి, మరో నాలుగు ఓడింది. ప్లేఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. కానీ వరుసగా గెలిస్తేనే నాకౌట్ కు అర్హత సాధించేందుకు అవకాశం ఉంటుంది.


More Telugu News