ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిరండి.. కోట్లిస్తాం: ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆఫర్

  • ఆరుగురు ఇంగ్లండ్ క్రికెటర్లను సంప్రదించినట్టు సమాచారం
  • తమతోనే పనిచేసే విధంగా ఒప్పందాలకు ప్రయత్నాలు
  • ఏడాది పాటు వివిధ లీగుల్లో ఆడించే యోచన
ఐపీఎల్ ఇప్పుడు ప్రపంచంలోనే ఖరీదైన క్రికెట్ లీగ్. ఐదేళ్ల కాలానికి టీవీ, డిజిటల్ ప్రసార హక్కులు రూ.50వేల కోట్లకు పైనే అమ్ముడుపోవడం అంటే ఐపీఎల్ ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఒక్కో ఫ్రాంచైజీకి ఐదేళ్ల కాలానికి గాను రూ.2,500 కోట్లు ముడుతుంది. అంటే ఏడాదికి రూ.500 కోట్లు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఐపీఎల్ ఆర్థికంగా ఎంత బలమైనదో. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇప్పుడు విదేశీ క్రికెట్ లీగ్ లలోకీ ప్రవేశిస్తున్నాయి. అక్కడి ఫ్రాంచైజీలను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ఐపీల్ ఫ్రాంచైజీలు ఒకటికి మించిన దేశాల్లో లీగ్ లతో కాసుల వర్షంపై కన్నేశాయి.

ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఓ ఆరుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లను తమతో పూర్తిగా చేరిపోవాలని కోరుతున్నట్టు తెలిసింది. అంతర్జాతీయ క్రికెట్ ను విడిచి పెట్టి తమతో వస్తే 5 మిలియన్ పౌండ్ల వరకు వార్షికంగా చెల్లింపులు చేస్తామంటూ సంప్రదింపులు చేస్తున్నాయనేది సమాచారం. తద్వారా ఏడాది వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగే టీ20 లీగుల్లో వారితో పూర్తి స్థాయిలో ఆడించాలనేది ఫ్రాంచైజీల ఎత్తుగడ. ఈ విషయాన్ని ‘టైమ్స్ లండన్’ ప్రచురించింది. కాకపోతే ఏ ఫ్రాంచైజీ, ఏ ఆటగాడిని సంప్రదించిందనే వివరాలను పేర్కొనలేదు. ప్రాథమిక చర్చలు నడిచాయని తెలిపింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్, ఇంగ్లిష్ కౌంటీలతో సంబంధం లేకుండా వారు పూర్తిగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆటగాడిగా కొనసాగాల్సి ఉంటుంది. 

సీపీఎల్ (వెస్ట్ ఇండీస్), ఎస్ఏ టీ20 (దక్షిణాఫ్రికా), గ్లోబల్ టీ20 లీగ్ (యూఏఈ), అమెరికాలో త్వరలో ఆరంభం కానున్న టీ20 లీగ్ లలో ఐపీఎల్ ఫ్రాంచైజీలకు జట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఫుట్ బాల్ లీగ్ లో ఏడాదంతా ఫ్రాంచైజీలను అట్టి పెట్టుకునే ఆటగాళ్లు ఉన్నారు. అదే మాదిరి ఐపీఎల్ ఫ్రాంచైజీలు పూర్తి స్థాయి ఆటగాళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రతిపాదన పట్ల యువ ఆటగాళ్లు సైతం ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే దీనికి ఆయా దేశాల క్రికెట్ బోర్డుల నిరభ్యంతర పత్రం  (ఎన్వోసీ)) అవసరం. ఒక్కో ఆటగాడు గరిష్ఠంగా ఎన్ని లీగుల్లో పాల్గొనాలనే విషయమై పరిమితి విధించాలని ఐసీసీ సైతం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News