రెడ్‌మీ ఫోన్ పేలుడుతో చిన్నారి మృతి ఘటనపై స్పందించిన కంపెనీ

  • కేరళలోని త్రిసూర్ జిల్లాలో 8 ఏళ్ల బాలిక మొబైల్ ఫోన్ పేలుడుతో దుర్మరణం
  • రెడ్‌మీ ఫోన్లో వీడియో చూస్తుండగా పేలుడు సంభవించినట్టు వెల్లువెత్తిన ఆరోపణ
  • ఘటనపై తాజాగా స్పందించిన రెడ్‌మీ ఫోన్ల మాతృ సంస్థ
  • ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు పోలీసులకు సహకరిస్తామని వెల్లడి
  • బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ
కేరళలో ఇటీవల ఓ 8 ఏళ్ల బాలిక రెడ్‌మీ సెల్‌ఫోన్ పేలుడుతో మృతి చెందిందన్న ఆరోపణలపై రెడ్‌మీ ఫోన్ల మాతృ సంస్థ తాజాగా  స్పందించింది. కస్టమర్ల భద్రతకే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ‘‘ఈ కఠిన సమయంలో మేము బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. బాలిక రెడ్‌మీ ఫోన్ చేతిలో పట్టుకుని ఉండగా పేలుడు సంభవించినట్టు కొన్ని ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి. ఇందులో నిజానిజాలను పోలీసులు ఇంకా తేల్చాల్సి ఉంది. ఈ ఘటన వెనుక కారణాలేంటో కనుక్కునేందుకు అధికారులకు సహకరిస్తాం. అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తాం’’ అంటూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 

త్రిసూర్ జిల్లాకు చెందిన ఆ బాలిక చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని వీడియో చూస్తుండగా పేలుడు సంభవించి, మృతి చెందింది. బాలిక వద్ద ఉన్నది రెడ్‌మీ ఫోన్‌ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది నిజమా? కాదా? అన్నది పోలీసులు ఇంకా తేల్చాల్సి ఉంది.


More Telugu News