వివేకా హత్య కేసులో కీలక మలుపు.. ఏ1 ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు

  • సాక్షులను గంగిరెడ్డి బెదిరిస్తున్నారని హైకోర్టుకు తెలిపిన సీబీఐ
  • గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని విన్నపం
  • 5వ తేదీ లోగా సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోవాలంటూ గంగిరెడ్డికి టీఎస్ హైకోర్టు ఆదేశం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5వ తేదీ లోపల సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. గంగిరెడ్డి బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసు కీలక దశలో ఉందని... గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పింది. కీలక నిందితుడు బయట ఉంటే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని పేర్కొంది. అందువల్ల గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది. 5వ తేదీ లోపల సీబీఐ కోర్టు ఎదుట గంగిరెడ్డి లొంగిపోకపోతే... ఆయనను అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి సూచించింది.

వివేకా హత్య కేసును తొలుత ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. 90 రోజులు గడిచిపోయినా గంగిరెడ్డిపై సిట్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. నిబంధనల ప్రకారం నిందితులపై 90 రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలి. లేని పక్షంలో సాంకేతిక కారణాలతో బెయిల్ లభిస్తుంది. ఇదే కారణంతో గంగిరెడ్డి బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. 2019 జూన్ 27న గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


More Telugu News