తెలంగాణ ఎడ్‌సెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

  • మే 1వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రకటన
  • మే 18వ తేదీన ప్రవేశ పరీక్ష
  • ఎంసెట్ పరీక్ష కేంద్రాలను పెంచుతున్న అధికారులు
తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్‌ పరీక్ష దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగించారు. బుధవారంతోనే గడువు ముగియగా.. మే1వ తేదీ వరకూ పొడిగించినట్టు తెలంగాణ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా దరఖాస్తులను సమర్పించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎడ్ సెట్ పరీక్ష మే 18న జరగనుంది. ఆ రోజు మూడు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. 

మరోవైపు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఎంసెట్  పరీక్ష కేంద్రాలను పెంచినట్టు అధికారులు తెలిపారు. ఎంసెట్‌కు భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో కేంద్రాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీఎస్‌ ఎంసెట్‌కు ఇప్పటి వరకు సుమారు 3.19 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాల వ్యాప్తంగా సుమారు 110 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో సుమారు 95 కేంద్రాలు తెలంగాణలో, మిగిలిన 15 కేంద్రాలు ఏపీలో ఏర్పాటు చేస్తున్నారు. మే 10, 11వ తేదీల్లో మెడికల్, అగ్రికల్చర్ విభాగాల ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మే 12, 13,14వ తేదీల్లో జరగనున్నాయి.


More Telugu News