షార్జా జైలు నుంచి విడుదలైన బాలీవుడ్ నటి

  • షార్జా విమానాశ్రయంలో డ్రగ్స్‌తో దొరికిన నటి క్రిసాన్ పెరీరా
  • ఆమె తల్లిపై కోపంతో నటిని ఇరికించిన నిందితులు
  • డ్రగ్స్ నింపిన ట్రోఫీని ఆమె చేతికిచ్చిన ఆంథోనీ, రవి
  • ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా యూఏఈలోని షార్జా జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె వద్దనున్న ట్రోఫీలో డ్రగ్స్‌ను గుర్తించిన షార్జా పోలీసులు ఈ నెల మొదట్లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 27 ఏళ్ల పెరీరా ‘సడక్ 2’, ‘బాట్లా హౌస్’ వంటి సినిమాల్లో నటించారు. 

డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటి క్రిసాన్ పెరీరాను ఇరికించిన ఇద్దరు నిందితులను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెరీరాను జైలుకు పంపేందుకు ఉద్దేశపూర్వకంగా వారు ఆమె తీసుకెళ్తున్న ట్రోఫీలో డ్రగ్స్ పెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఒకరిని ముంబైలోని బొరివలీకి చెందిన ఆంథోనీ పాల్‌గా గుర్తించగా, మరొకరిని మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌కు చెందిన రాజేశ్ బాభోటే అలియాస్ రవిగా గుర్తించారు.  

క్రిసాన్‌ను కుట్రపూరితంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం ఘటన వెనక ఆంథోనీ పాల్ ఉన్నట్టు గుర్తించారు. నటి తల్లి ప్రేమిలా పెరీరాపై ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే అతడు క్రిసాన్‌ను డ్రగ్స్ కేసులో ఇరికించినట్టు గుర్తించారు.  

అందులో భాగంగా ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌ కోసం యూఏఈలో ఆడిషన్స్ జరుగుతున్నాయంటూ ఆంథోనీ, రవి కుట్రపూరితంగా ఆమెను అక్కడికి పంపారు. విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత డ్రగ్స్‌తో నింపిన ట్రోఫీని ఆమెకు అందించారు. అంతేకాదు, పాల్ ఇలాగే మరో నలుగురిని కూడా ఇరికించినట్టు ముంబై పోలీసులు గుర్తించారు.


More Telugu News