ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌ను మాకిచ్చేయండి.. ఏపీని కోరిన తెలంగాణ

  • ఏపీ-తెలంగాణ ఉమ్మడి ఆస్తులపై చర్చ
  • విభజన సమయంలో ఏపీ, తెలంగాణ ఆస్తులను 52:48 నిష్పత్తిలో పంచిన కేంద్రం
  • ఏపీ-తెలంగాణ భవన్‌ను వదిలేస్తే అదే నిష్పత్తి ప్రకారం డబ్బులు చెల్లిస్తామన్న తెలంగాణ
  • సానుకూలంగా స్పందించిన ఏపీ
  • సీఎం జగన్‌తో చర్చించాక ఏ విషయం చెబుతామన్న ఏపీ ప్రతినిధులు
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌కు ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌తో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని, కాబట్టి దానిని తమకు వదిలేయాలని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు. దానిని తమకు ఇచ్చేస్తే పటౌడీ హౌస్‌లో తమకున్న ఏడెకరాలకు పైగా స్థలాన్ని తీసుకుని అక్కడ కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని సూచించారు. 

తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఉమ్మడి స్థిరాస్తులను కేంద్రం పంచిపెట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ భవన్ విజభనకు సంబంధించి నిన్న రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, ఆదిత్యనాథ్ దాస్, ప్రేమ చంద్రారెడ్డి, ఏపీ భవన్‌ అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌషిక్ తదితరులు ప్రతినిధులుగా హాజరు కాగా, తెలంగాణ నుంచి రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు మాట్లాడుతూ.. అశోకా రోడ్డులో ఉన్న ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌ను పూర్తిగా తమకు వదిలేయాలని కోరారు. దానితో తెలంగాణ ప్రజలకు విడదీయలేని భావోద్వేగ సంబంధాలు ముడిపడి ఉన్నాయని అన్నారు.

కాగా, రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆస్తులను ఏపీ, తెలంగాణకు 52:48 నిష్పత్తిలో పంచారు. ఢిల్లీలోని అశోకా రోడ్డుతోపాటు శ్రీమంత్ మాధవరావు సింధియా మార్గ్‌లో కలిపి ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడిగా 19.733 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం భూమిలో అశోకా రోడ్డులోని ఏపీ-తెలంగాణ భవన్ 8.726 ఎకరాల్లో ఉండగా, దానిలో ఏపీ వాటా 4.3885 ఎకరాలు. దీని విలువ రూ. 1,703.6 కోట్లు. తెలంగాణ వాటా 4.3375 ఎకరాలు కాగా, దాని విలువ రూ. 1,694.4 కోట్లు. ఇక, 0.511 ఎకరాల రోడ్డులో రెండు రాష్ట్రాలకు 0.2555 ఎకరాల చొప్పున ఉంది. దీని విలువ రూ. 160 కోట్లు. 

తెలంగాణ కింద గోదావరి బ్లాక్‌లో 4.082 ఎకరాలు, ఏపీ కింద శబరి బ్లాక్‌ లో 4.133 ఎకరాలు ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల భవనాలు ఒకే చోట ఉండకుండా పటౌడీ హౌస్‌లోని భూమిని ఏపీ తీసుకుని ఏపీ-తెలంగాణ భవన్‌ను తమకు వదిలేయాలని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు. అందులో భాగంగా 58:42 నిష్పత్తిలో ఏపీకి దక్కాల్సిన భూమికి మార్కెట్ రేటు ప్రకారం ధర చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 

తెలంగాణ అధికారుల ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన ఏపీ అధికారులు ఈ విషయంపై తమ సీఎం జగన్ మోహన్‌రెడ్డితో చర్చించాక నిర్ణయం చెబుతామని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో వచ్చేవారం మరోమారు సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు నిర్ణయించారు.


More Telugu News