ఆపరేషన్ కావేరీ: సౌదీకి చేరుకున్న 128 మంది భారతీయులు

  • సూడాన్‌‌‌‌‌లోని భారతీయులను రక్షించేందుకు ఆపరేషన్ కావేరి 
  • ఆరో విడత తరలింపులో భాగంగా జెడ్డాకు చేరుకున్న 128 మంది భారతీయులు
  • విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ట్వీట్
  • త్వరలో వీరిని భారత్‌కు తరలిస్తామని వెల్లడి
ఘర్షణలతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి భారతీయుల తరలింపునకు ఉద్దేశించిన ఆపరేషన్ కావేరీలో భాగంగా గురువారం ఉదయం మరో 128 మంది భారతీయులు సౌదీ అరేబియాకు చేరుకున్నారు. ఆరో విడత తరలింపులో భాగంగా వీరు భారత వాయుదళానికి చెందిన సీ-130జే విమానంలో జెడ్డా విమానాశ్రయంలో దిగారు. ఇప్పటివరకూ సుమారు 1100 మంది భారతీయులను సూడాన్ నుంచి సురక్షితంగా తరలించారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ.మురళీధరన్ గురువారం ఉదయం ట్వీట్ చేశారు. 

ఆపరేషన్ కావేరీని పర్యవేక్షించేందుకు మంత్రి మురళీధరన్ ప్రస్తుతం జెడ్డాలోనే ఉన్నారు. మిగతా వారిని కూడా వీలైనంత త్వరగా సూడాన్ నుంచి తీసుకొస్తామని చెప్పారు. సైనిక దళాల హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్రం 'ఆపరేషన్ కావేరి'ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ 450 మంది ప్రాణాలు కోల్పోగా, 4 వేల పైచిలుకు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఇక, సూడాన్‌లో చిక్కుకున్న విదేశీయుల తరలింపునకు వీలుగా సైనిక దళాలు 72 గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించడంతో వివిధ దేశాలు వేగంగా తమ పౌరులను స్వదేశానికి తరలిస్తున్నాయి.


More Telugu News