చంద్రుడిపై దిగడానికి క్షణాల ముందు భూమితో తెగిపోయిన సంబంధాలు.. కూలిపోయిన జపాన్ ‘కుందేలు’

  • జాబిల్లిపై పరిశోధనల కోసం డిసెంబరులో చంద్రుడిపైకి ‘హకుటో-ఆర్’
  • మోసుకెళ్లి విడిచిపెట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్
  • అందులో ఒక రోబో, మరో రోవర్ 
  • గతంలో ఇలాగే కూలిన మన ‘విక్రమ్’
చంద్రుడిపై ప్రయోగాల కోసం జపాన్ పంపిన ‘హకుటో-ఆర్’ ల్యాండర్.. జాబిల్లిపై ల్యాండ్ కావడానికి కొన్ని క్షణాల ముందు కుప్పకూలింది. భూమితో అది సంబంధాలను కోల్పోవడంతో కూలిపోయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. టోక్యోకు చెందిన ‘ఐస్పేస్’ అనే ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ల్యాండర్‌ను అభివృద్ధి చేసింది. హకుటో అంటే జపాన్ భాషలో కుందేలు అని అర్థం.

‘హకుటో-ఆర్’ ఎత్తు ఆరడుగులు కాగా, బరువు 340 కేజీలు. చంద్రుడిపై పరిశోధనల కోసం ‘రషీద్’ అనే రోవర్‌తోపాటు బేస్‌బాల్ పరిమాణంలో ఉండే రోబోను ఇందులో అమర్చి పంపారు. ‘రషీద్’ రోవర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందినది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా డిసెంబరులో ‘హకుటో-ఆర్’ను చంద్రుడిపైకి పంపారు. అది చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా చేరుకుని ల్యాండింగ్‌కు సిద్దమైంది. అయితే, ల్యాండ్ కావడానికి కొన్ని క్షణాల ముందు భూమితో సంబంధాలు తెగిపోవడంతో అది కాస్తా దానిపైనే కూలిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

కాగా, చంద్రుడిపై పరిశోధనలకు గాను 2019లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపిన విక్రమ్, ఇజ్రాయెల్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ పంపిన బెరెషీట్ ల్యాండర్ కూడా ఇలానే చివరి క్షణాల్లో విఫలమయ్యాయి.


More Telugu News