అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్‌కు రైతుల నుండి నిరసన సెగ

  • సీఎం కాన్వాయ్ ని అడ్డుకునేందుకు రైతుల ప్రయత్నం
  • జగన్ పుట్టపర్తికి రోడ్డు మార్గంలో వెళ్తుండగా ఘటన
  • నిరసనకారులను తప్పించిన భద్రతా సిబ్బంది
అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతుల నుండి నిరసన సెగ తగిలింది. సీఎం కాన్వాయ్ ని అడ్డుకునేందుకు కొంతమంది రైతులు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి ఈ రోజు నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. నార్పల నుండి పుట్టపర్తికి తీసుకు వెళ్లే ప్రత్యేక హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తి చేరుకున్నారు. ఈ సమయంలో ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద జగన్ కాన్వాయ్ ని రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది వారిని తప్పించింది. దీంతో జగన్ కాన్వాయ్ ముందుకు సాగింది.

పేదలకు ఇళ్ల స్థలాల కోసమంటూ తుంపర్తి, మోటుమర్రు ప్రాంతంలో 210 ఎకరాలు సేకరించిన అధికారులు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిహారం ఇప్పించడంలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విఫలమయ్యారని మండిపడ్డారు. తాము సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని, కానీ పోలీసులు తమను తోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News