తెలుగు తల్లి, తెలంగాణ బిడ్డ అంటూ షర్మిలకు గద్దర్ ప్రశంసలు

  • రాజకీయ శక్తిగా మారిందనే ఆమెను బయటకు రానివ్వడం లేదని ప్రభుత్వంపై విమర్శ
  • టీ సేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ధర్నాకు హాజరైన గద్దర్
  •  షర్మిల తెలంగాణ నాడి పట్టుకున్నారని ప్రశంస   
పోలీసులపై దాడి చేసిన కేసులో బెయిల్ పై విడుదలైన వైఎస్ ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రజా గాయకుడు గద్దర్ సంఘీభావం తెలిపారు. షర్మిల తన ఆత్మరక్షణ కోసమే అలా చేశారన్నారు. టీ సేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో గద్దర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ఏ పార్టీ సభ్యుడిని కాదంటూనే షర్మిలపై ప్రశంసల వర్షం కురిపించారు. షర్మిల తెలుగు తల్లి, తెలంగాణ బిడ్డ అని కొనియాడారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అనే నినాదంతో షర్మిల తన పోరాటం మొదలు పెట్టారని తెలిపారు. 

షర్మిల రాజకీయ శక్తిగా మారింది కాబట్టే ప్రభుత్వం ఆమెని ఇంటి నుంచి బయటకి రానివ్వడం లేదన్నారు. తెలంగాణ వచ్చాక కన్నీళ్లు తప్ప ఏం రాలేదన్నారు. షర్మిల తెలంగాణ నాడి పట్టుకున్నారని గద్దర్ చెప్పారు. సీఎం కేసీఆర్ పతనమయ్యే దశ వచ్చిందని విమర్శించారు. ఓట్ల యుద్ధానికి సిద్ధం కావాలని యువతకు పిలుపునిచ్చారు.. విద్యార్థులు రాజకీయ శక్తిగా మారాలని అభిప్రాయపడ్డారు. టీ సేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర జరుగుతున్న నిరాహార దీక్షలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, పలు రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


More Telugu News