అర్జున్ టెండూల్కర్ కు బ్రెట్ లీ కీలక సూచన

  • దాదాపు ప్రతి దానినీ విమర్శించే వారు చుట్టూ ఉంటారన్న బ్రెట్ లీ
  • విమర్శలను పట్టించుకోవద్దంటూ సూచన
  • తక్కువ పేస్ తో బౌలింగ్ చేస్తున్నాడంటూ అర్జున్ పై విమర్శలు
సచిన్ టెండూల్కర్ తనయుడైన అర్జున్ టెండూల్కర్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. మూడేళ్ల క్రితమే ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన ఈ 23 ఏళ్ల బౌలర్, తాజా ఐపీఎల్ సీజన్ లోనే తుది జట్టులో భాగంగా ఆడే అవకాశాన్ని దక్కించుకుంటున్నాడు. తొలి మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా తీయకపోగా, రెండో మ్యాచ్ లో ఒక్క వికెట్ తో మెరిశాడు. అంతెందుకు మంగళవారం గుజరాత్ టైటాన్స్ మ్యాచులోనూ తన ఐపీఎల్ కెరీర్లో రెండో వికెట్ నమోదు చేసుకున్నాడు. 

ఈ క్రమంలో అర్జున్ టెండూల్కర్ పై కొందరు విమర్శలు కురిపిస్తున్నారు. అర్జున్ కు అవకాశాలు రావడం వెనుక, ముంబై జట్టుకు సచిన్ టెండూల్కర్ మెంటార్ గా ఉండడం వల్లేనన్న వ్యాఖ్యలు వచ్చాయి. అర్జున్ బౌలింగ్ అలైన్మెంట్, పేస్ సరిగ్గా లేవని, మార్చుకోవాలంటూ పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ సూచించడం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మాజీ మౌలర్ బ్రెట్ లీ సైతం స్పందించాడు. విమర్శలను పట్టించుకోవద్దంటూ అర్జున్ టెండూల్కర్ కు కీలక సూచన చేశాడు. 

గుజరాత్ టైటాన్స్ తో మ్యాచులో అర్జున్ పవర్ ప్లేలో రెండు ఓవర్లు వేసి, 9 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అర్జున్ బౌలింగ్ వేగం 107.2 కిలోమీటర్లే ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో బ్రెట్ లీ స్పందిస్తూ.. ‘‘దాదాపు ప్రతి దానినీ విమర్శించే వ్యక్తులు చుట్టూ ఉంటారు. సందీప్ శర్మ బౌలింగ్ వేగం 120 కిలోమీటర్లే ఉంది. శర్మ కంటే ఎక్కువ వేగంతో అర్జున్ బౌలింగ్ చేయగలడు. అతడి వయసు ఇంకా 23 ఏళ్లే. అతడి మొత్తం కెరీర్ ఇంకా ముందుంది. విమర్శలను పట్టించుకోవద్దన్నది నా సూచన’’ అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.


More Telugu News