పురుషులలో ఆ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు..!

  • పురుషుల్లో సాధారణంగా కనిపించే అంగస్తంభన సమస్య
  • దీని వెనుక కొన్ని సందర్భాల్లో సీరియస్ సమస్యలు ఉండొచ్చు
  • ఎక్కువ రోజుల పాటు సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి
పురుషుల్లో అంగస్తంభన లోపం సాధారణంగా కనిపించే సమస్య. కొంచెం వయసు మళ్లిన వారిలో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఎరక్టైల్ డిస్ ఫంక్షన్ (ఈడీ) అని వైద్యులు పిలుస్తారు. ఈ సమస్యలో లైంగిక చర్యకు అవసరమైన మేర అంగం స్తంభించదు. ఇది సాధారణంగా చిన్న సమస్య కావచ్చు. లేదా భవిష్యత్తులో వచ్చే పెద్ద అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఎప్పుడో ఒకసారి ఈడీ కనిపిస్తే పెద్దగా ఆందోళన అక్కర్లేదు. కానీ, తరచుగా కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

గుండె జబ్బులు
అంగస్తంభన లోపం వెనుక చాలా సందర్భాల్లో గుండె జబ్బు కారణం  కావచ్చు. భవిష్యత్తులో గుండె జబ్బులు బయట పడొచ్చు. ఆర్టరీల్లో కొవ్వులు పేరుకుపోవడాన్ని అథెరోస్కెలరోసిస్ అంటారు. దీనివల్ల అంగానికి కావాల్సినంత రక్తం సరఫరా జరగదు. దీంతో స్తంభన లోపం ఎదురవుతుంది. అథెరో స్కెలరోసిస్ అన్నది స్ట్రోక్, హార్ట్ ఎటాక్ కు కారణమవుతుంది. 

ఒత్తిడి, దిగులు
మానసిక పరమైన దిగులు, ఒత్తిళ్లు కూడా ఈడీ సమస్యకు కారణం కావచ్చు. మెదడులో రసాయనాల మధ్య సమతుల్యం లోపించినప్పుడు.. అంగానికి సంకేతాలు సరిగ్గా వెళ్లవు. అప్పుడు కూడా స్తంభన లోపం ఏర్పడుతుంది. స్తంభించేందుకు ఎక్కువ సమయం తీసుకోవచ్చు. 

ఆల్కహాల్
ఆల్కహాల్ అలవాటు వల్ల కూడా ఈడీ సమస్య తలెత్తుతుంది. దీనికి కారణం అంగానికి రక్త సరఫరా సరిపడా జరగకపోవడమేనని ఐర్లాండ్ హెల్త్ సర్వీస్ నిర్వహించిన అధ్యయనంలో తెలిసింది. దీర్ఘకాలం పాటు ఆల్కహాల్ తీసుకునే అలవాటుతో మెదడులో న్యూరాన్లపై ప్రభావం పడుతుంది. దాంతో టెస్టోస్టెరాన్ (లైంగిక ఉద్దీపనలకు సాయం చేసే హార్మోన్) తగ్గిపోతుంది.

మధుమేహం
మధుమేమం సమస్యతో బాధపడే వారిలోనూ అంగస్తంభన లోపాలు సహజంగా కనిపిస్తుంటాయి. దీర్ఘకాలంగా మధుమేహం సమస్యతో ఉన్న వారిలో నరాలు, రక్త నాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల రక్త సరఫరాలో సమస్య ఏర్పడుతుంది. దీంతో అంగస్తంభన లోపం కనిపిస్తుంది.


More Telugu News