క్రెడిట్ కార్డు మోసాల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు 

  • క్రెడిట్ కార్డులకు తప్పకుండా యూసేజ్ లిమిట్ పెట్టుకోవాలి
  • ఫోన్లో యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే నిర్వహణ సులభం
  • చెల్లించడానికి ముందు కార్డును ఆన్ చేసుకుని వాడుకోవచ్చు
  • మీ కళ్ల ముందే కార్డును స్వైప్ చేసేలా చూసుకోవాలి
క్రెడిట్ కార్డుల వినియోగం మన దేశంలోనూ గణనీయంగా పెరుగుతోంది. వేతన జీవుల్లో అధిక శాతం మంది వద్ద నేడు కనీసం ఒకటి రెండు క్రెడిట్ కార్డులు అయినా ఉంటున్నాయి. కొందరి వద్ద మూడు నుంచి ఐదు కార్డులున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో కార్డు మోసాలు కూడా పెరుగుతున్నాయి. కనుక క్రెడిట్ కార్డుల విషయంలో మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలను తప్పకుండా ఆచరణలో పెట్టాలి.

ఒకటికి మించిన క్రెడిట్ కార్డులు ఉన్న వారు.. నెలవారీ బిల్లులు, ఈఎంఐలు ఆటోమేటిగ్గా చేసేందుకు ఒక కార్డును వినియోగించాలి. ఆ కార్డును వెంట తీసుకెళ్లొద్దు. ఇతర లావాదేవీలకు ఆ కార్డును వినియోగించొద్దు. నెలవారీ బిల్లులకు ఉపయోగించే కార్డులోనూ లిమిట్స్ పెట్టుకోవాలి. అంటే ఒక్కో లావాదేవీకి సంబంధించి గరిష్ఠ పరిమితి పెట్టుకోవచ్చు.

మరో కార్డును బయట పీవోఎస్, పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లు, ఆన్ లైన్ కొనుగోళ్లకు ఉపయోగించుకోవాలి. ఈ కార్డుకు చెల్లింపుల పరిమితి చాలా తక్కువగా ఉండాలి. ఒక లావాదేవీలో గరిష్ఠంగా ఎంత చెల్లిస్తారో ఎవరికి వారికి తెలిసి ఉంటుంది. అంత మేరే పరిమితి పెట్టుకోవాలి. ఉదాహరణకు రూ.5,000గా పరిమితి పెట్టుకుంటే అంతకుమించి కార్డును ఇతరులు దుర్వినియోగం చేయడానికి ఉండదు. 

ప్రతీ క్రెడిట్ కార్డు జారీ సంస్థ యాప్ సేవలను అందిస్తోంది. సదరు యాప్ ను మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ నుంచి కార్డు వినియోగ పరిమితులను ఎప్పటికప్పుడు నిర్వహించుకోవచ్చు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్, ఆన్ లైన్, ట్యాప్ అండ్ పే, ఏటీఎం, పీవోఎస్ ఇలా అన్ని కంట్రోల్స్ ఉంటాయి. ఉదాహరణకు ఇంటర్నేషనల్ లావాదేవీలకు కార్డును వినియోగించకుండా ఆఫ్ చేసుకోవచ్చు. దేశీయ వినియోగాన్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లావాదేవీలకు ఉపయోగించకుండా ఆఫ్ చేసుకోవచ్చు. పీవోఎస్ ద్వారా చెల్లిస్తున్నారనుకోండి. యాప్ తెరిచి పీవోఎస్ ను ఆన్ చేసుకోవాలి. లావాదేవీ ముగిసిన తర్వాత తిరిగి ఆఫ్ చేసుకుంటే.. ఇక మీ కార్డును మరొకరు దుర్వినియోగం చేయడానికి ఉండదు.

ఆన్ లైన్ లో ఏ పోర్టల్ లోనూ క్రెడిట్ కార్డు వివరాలను సేవ్ చేసుకోవద్దు. ఆఫ్ లైన్ లో పీవోఎస్ రీడర్ వద్ద మీ కార్డును రీడ్ చేసే సమయంలో దానివైపే చూడండి. పెట్రోల్ స్టేషన్లలో మీ ముందే కార్డును స్వైప్ చేయాలని కోరండి. లేదంటే మనం చూసే లోపే కార్డు వివరాలను వారు ఇతర పరికరాల్లో స్కాన్ చేసుకునే ప్రమాదం ఉంది.

క్రెడిట్ కార్డుల లిమిట్ పై బీమా తీసుకోవడం మరో మంచి ఆలోచన. ఉదాహరణకు మీ కార్డుపై రూ.లక్ష రూపాయలు ఖర్చు చేసుకునే పరిమితి ఉందనుకోండి. కార్డు మోసం జరిగి లేదా దుర్వినియోగం వల్ల నష్టపోతే అంత మేరకు బీమా సంస్థ పరిహారం చెల్లిస్తుంది. పబ్లిక్ వైఫై నెట్ వర్క్ లలో కార్డును ఉపయోగించొద్దు. కార్డుకు సంబంధించిన పిన్ ను తరచూ మార్చుకోవాలి. ప్రతి నెలా కార్డు స్టేట్ మెంట్ లోని ప్రతీ లావాదేవీని చెక్ చేసుకుని, అనుమానాస్పద లావాదేవీ ఉంటే ఫిర్యాదు చేయాలి. ఒకవేళ కార్డు పోతే వెంటనే బ్లాక్ చేసేందుకు వీలుగా సంబంధిత బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ లేదా ఎస్ఎంఎస్ నంబర్ ను కాంటాక్టుల్లో సేవ్ చేసి పెట్టుకోవాలి.


More Telugu News