సల్మాన్ సినిమాతోను దక్కని సక్సెస్ .. డీలాపడిన పూజ హెగ్డే!
- సౌత్ లో పూజ హెగ్డేకి మంచి క్రేజ్
- నార్త్ లోను మంచి ఫాలోయింగ్
- కొంతకాలంగా వరుస పరాజయాలు
- కాపాడలేకపోయిన సల్మాన్ సినిమా
- తరువాత సినిమాపైనే ఆశలు
పూజ హెగ్డే .. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా చాలా కాలం నుంచి చక్రం తిప్పుతోంది. కోలీవుడ్ లోను కుదురుకోవడానికి ట్రై చేస్తూ, బాలీవుడ్ పై పట్టు సాధించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూ వెళుతోంది. సౌత్ లోను .. నార్త్ లోను ఈ బ్యూటీకి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అందువలన పాన్ ఇండియా సినిమాలోను తేలికగా అవకాశాలు దక్కించుకోగలిగింది. అయితే కొంతకాలంగా పూజ హెగ్డేకి కాలం కలిసి రావడం లేదు. ఏ ప్రాజెక్టును పట్టుకున్నా ఫ్లాప్ ను చేతుల్లో పెట్టేస్తోంది. ఆ మధ్య చేసిన 'రాధేశ్యామ్' .. 'బీస్ట్' .. 'ఆచార్య' ఈ మూడు ప్రాజెక్టులు అంత ఆషామాషీవేం కాదు. అన్నీ కూడా భారీతనమంటే ఇది అని నిరూపించిన సినిమాలే. అలాంటి సినిమాలే ఆమెకి సక్సెస్ ను ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఆమె సల్మాన్ సొంత సినిమా అయిన 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. కానీ ఓపెనింగ్స్ విషయంలోనే ఈ సినిమా నిరాశపరిచింది. పుంజుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దాంతో పూజ పూర్తిగా డీలాపడిపోయిందని అంటున్నారు. తరువాత సినిమా అయినా ఆమెను గట్టెక్కిస్తుందేమో చూడాలి.