పట్టపగలే నీడ మాయం.. బెంగళూరులో జీరో షాడో డే!

  • ఒకటిన్నర నిమిషాల పాటు సిటీలో ఖగోళ అద్భుతం
  • నిటారుగా ఉన్న వస్తువులకు కనిపించని నీడ
  • ఏటా రెండుసార్లు ఇలా జరుగుతుందన్న శాస్త్రవేత్తలు
బెంగళూరులో మంగళవారం అరుదైన సంఘటన చోటుచేసుకుంది. పట్టపగలే వస్తువులు, మనుషుల నీడ మాయమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12:17 గంటలకు ఎండలో నిటారుగా ఉన్న వస్తువులకు నీడ కనిపించలేదు. దాదాపు ఒకటిన్నర నిమిషాల పాటు ఈ అద్భుతం జరిగింది. ఈ వింతను జీరో షాడో గా వ్యవహరిస్తారని, ఏటా రెండుసార్లు జీరో షాడో డే చోటుచేసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2021లో ఒడిశాలోని భువనేశ్వర్ లో చోటుచేసుకున్న ఈ ఖగోళ అద్భుతం ఈసారి బెంగళూరులో కనిపించిందని చెప్పారు.

ఏమిటీ జీరో షాడో డే..
వెలుతురు వెన్నంటే నీడ కూడా ఉంటుంది.. కానీ సూర్యకాంతిలో ఉన్నప్పటికీ నీడ కనిపించకపోవడమే జీరో షాడో. ఈ వింత జరిగిన రోజును జీరో షాడో డే గా వ్యవహరిస్తారు. ఈ ఏడాది జీరో షాడో డే వింత బెంగళూరులో చోటుచేసుకుంది. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తల ప్రకారం.. జీరో షాడో డే కర్కాటక రాశి, మకర రాశి మధ్య సంవత్సరానికి రెండుసార్లు కదులుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉత్తరాయణం, దక్షిణాయనం రెండింటిలోనూ సూర్యుని క్షీణత ఆ ప్రాంతాల అక్షాంశానికి సమానంగా ఉంటుంది. అందుకే సూర్యుడు నడి నెత్తిన కనిపిస్తాడు, దీంతో సూర్యకాంతి పడినప్పటికీ నీడ కనిపించదు.

ఏటా రెండుసార్లు..
ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణంలో మరొకసారి చొప్పున ఏటా రెండమార్లు జీరో షాడో డే వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వింత సెకనులో కొంత భాగం మాత్రమే ఉంటుంది కానీ, దాని ప్రభావం ఒకటిన్నర నిమిషాల వరకు కనిపిస్తుందని చెప్పారు. ఒడిశాలోని భువనేశ్వర్ వాసులు 2021లో జీరో షాడో డే వింతను చూశారు.


More Telugu News